Monday, December 23, 2024

దక్షిణాదిపై బిజెపిలో జ్ఞానోదయం!

- Advertisement -
- Advertisement -

దక్షిణాదిలో పాగా వేయడం అనుకున్నంత సుళువు కాదని భారతీయ జనతా పార్టీ గ్రహించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ జ్ఞానోదయంతో అది ఈ రాష్ట్రాల్లో తన పని తీరును మార్చుకోగలిగితే కొంతైనా ప్రయోజనం పొందడానికి సందు ఏర్పడుతుంది. లేనిపక్షంలో అదొక సామాజిక కయ్యాలమారి పార్టీగా అప్రతిష్ఠపాలై ఇక్కడ ఎందుకు కొరగానిదిగా నిరూపించుకుంటుంది.

తెలంగాణలో బిజెపి ముఖ్య ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు ఈ మధ్య ఒక ఆంగ్ల వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో దక్షిణాదిని గెలవడం తమ పార్టీకి ఆషామాషీ వ్యవహారం కాబోదని చెప్పడం గమనించదగినది. ఉత్తరాదిలో అది అవలంబిస్తున్న భావోద్వేగ ప్రధానమైన, మత సంబంధ విభజనతో కూడిన రాజకీయాలు దక్షిణ భారతంలో పని చేయవని కృష్ణసాగర్ సవ్యంగానే కనుగొన్నారు. అక్కడి మాదిరిగా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడం ఇక్కడ సాధ్యం కాదని ఆయన అంచనా వేసినది ముమ్మాటికీ వాస్తవం.

ఎందుకంటే దక్షిణాది ప్రజల్లోని చైతన్యం ఉత్తరాదిలో కనిపించదు. ఉత్తరాదిలో మహమ్మదీయ దాడులు, ఢిల్లీ కేంద్రంగా సాగిన కేంద్రీకృత పాలన నేపథ్యం వున్నదని, దక్షిణాదిలో స్వతంత్ర రాష్ట్రాలు తమంత తాము పాలించుకొనే అవకాశాన్ని బ్రిటిష్ వారు కల్పించారని దీని వల్ల ఇక్కడ విద్యా వికాసం, అభివృద్ధి బాగా జరిగాయని కృష్ణసాగర్ రావు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి చదువులోగాని, సర్వతోముఖాభివృద్ధిలోగాని ఈ రెండు ప్రాంతాల మధ్య ఏనుగుకి, దోమకి వున్నంత తేడా వున్నది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధితో పోల్చుకుంటే ఉత్తరాదిలో ఏ ఒక్క రాష్ట్రామూ సాటి రాదు. అలాగే మిగతా దక్షిణాది రాష్ట్రాల ముందూ ఉత్తరాది రాష్ట్రాలు బలాదూరే. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలు కాగా, ఉత్తరప్రదేశ్‌ది కేవలం రూ. 65 వేలు మాత్రమే కావడం గమనించవలసిన విషయం.

202223లో అంటే ఈ ఏడాది జూన్ వరకు అత్యధిక తలసరి ఆదాయం వున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. మిగతా నాలుగు రాష్ట్రాలు ఢిల్లీ, కర్నాటక, హర్యానా, గుజరాత్. అలాగే అతి తక్కువ తలసరి ఆదాయం వున్న రాష్ట్రాలు ఒడిశా, అసోం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. బీహార్ తలసరి ఆదాయం కేవలం రూ. 50 వేలు. దక్షిణాదిలోని కేరళ అక్షరాస్యతలో అగ్రగామి కావడం తెలిసిందే. తమిళనాడు, కర్నాటకలు కూడా ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఉత్తరాది కంటే దక్షిణాది అక్షరాస్యతలో ఎంతో ముందుంది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మహిళల ప్రగతిలో ఉత్తరాది అధోగతిలో వుంది.

కేంద్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక వాటా నిధులు అందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధుల కంటే అది వాటి నుంచి పొందుతున్నదే ఎక్కువ. ఉత్తరప్రదేశ్ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్న ప్రతి ఒక్క రూపాయికీ ప్రతిగా కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి రూ. 1.79 అందుతున్నది. అదే సమయంలో కర్నాటక నుంచి కేంద్రానికి చేరుతున్న ప్రతి రూపాయి పన్ను ఆదాయానికి కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి అందుతున్నది కేవలం 47 పైసలే. కేరళ, తమిళనాడు పరిస్థితి కూడా అంతే. 201415 నుంచి 202021 వరకు తెలంగాణ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్ళిన నిధులు రూ. 3,65,797 కాగా, అదే సమయంలో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది కేవలం రూ. 1,68,647 మాత్రమే. ఆర్థికంగానే కాదు సామాజికంగా కూడా దక్షిణాది పురోగామి పథంలో పరుగులు తీస్తున్నది.

అక్కడ మాదిరిగా వైషమ్యాలు, వెనుకబాటుతనం గూడు కట్టుకోడం దక్షిణాదిలో కనిపించదు. అందుకనుగుణంగానే దక్షిణాది ప్రజల ఆలోచన, ఆచరణ వికాసవంతంగా వుంటాయి.దక్షిణాది ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయ పక్షాలకు మింగుడు పడనంత దృఢంగా నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఎఐఎడిఎంకె భుజమ్మీద తుపాకి పెట్టి ద్రావిడ చైతన్యాన్ని దెబ్బతీయడానికి విఫలయత్నం చేసిన బిజెపి ఎంతటి భంగపాటుకు గురైందో చూశాము. అందుకే ఉత్తరాది తరహా రాజకీయాన్ని బిజెపి దక్షిణాదిలో విజయవంతంగా నడిపించజాలదు. అక్కడి మాదిరిగా మతచిచ్చుతో ఇక్కడ రాజకీయ చలి కాచుకోలేదు. దక్షిణాదిలో బిజెపికి సమర్థులైన యువ నాయకులు లేరని కృష్ణసాగర్ రావు చెప్పింది సత్యమే. కర్నాటకలో అతి కష్టం మీద అధికారం చేజిక్కించుకోగలిగిన బిజెపి ఆ రాష్ట్రాన్ని ఎంతగా బలి తీసుకుంటున్నదో కళ్లముందున్న కఠోర వాస్తవమే. హిజాబ్ వంటి అనవసరమైన వివాదాలు రెచ్చగొట్టి అశాంతిని పెంచడమే కాకుండా కాంట్రాక్టర్ల వద్ద అత్యధిక కమీషన్లు వసూలు చేస్తూ అవినీతిలో అగ్రగామిగా నిరూపించుకుంటున్నది.

తమకు వచ్చే ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టు మీద మంత్రులకు 40 శాతం కమీషన్ చెల్లించుకోవలసి వస్తున్నదని కర్నాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం బహిరంగంగా వెల్లడించింది. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బిజెపి పాలన దాపురిస్తే పరిస్థితి అంతకంటే ఘోరంగా వుంటుందని చెప్పనక్కర లేదు. అయితే దక్షిణాది ప్రజలు బిజెపి పప్పులుడకనివ్వరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News