Wednesday, January 22, 2025

ట్రబుల్ ఇంజిన్ గ్రోత్

- Advertisement -
- Advertisement -

Karnataka high court upholds hijab ban

అభివృద్ధి అనే దానికి భిన్న అర్థాలు స్థిరపడ్డాయి. అది ప్రజల జీవితాల్లో ప్రతిఫలించాలనే విషయంలో ఎవరికీ అభ్యంతరం లేకపోయినప్పటికీ దానిని సాధించడానికి అవలంబించే మార్గాల విషయంలోనే భిన్నత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వనరులన్నింటినీ ప్రైవేటు రంగానికి అప్పగించి ప్రభుత్వం కేవలం పాలనకే పరిమితం కావడం దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న బిజెపి, సంఘ్ పరివార్ శక్తుల దృష్టిలో అసలైన అభివృద్ధి. బడా కార్పొరేట్ శక్తులు, బహుళ జాతి సంస్థల కోసం గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయడం అందుకోసం మారుమూల అమాయక ఆదివాసీ జనం కాళ్లకింద నేలను కదిలించి వేయడం కూడా వారి అభివృద్ధి వ్యూహంలో భాగమే. దీనిని ప్రశ్నించే వారిని తిరుగుబాటుదారులుగా ముద్రవేసి, వారికి నైతిక మద్దతు తెలిపేవారికి పట్టణ నక్సలైట్లుగా నామకరణం చేయడం కూడా అందులోనిదే. దీని వెనుక కాషాయ పాలకుల మితవాద రాజకీయ దృష్టి సుస్పష్టం. అది వారి సిద్ధాంతం. ప్రజలిప్పుడు దాన్నే ఎన్నుకున్నారు కాబట్టి అది దేశ అజెండాగా మారిపోయింది. దానిని అటుంచితే వ్యవసాయ రంగం నుంచి రైతు కూలీలను తప్పించి ఆ రంగం మొత్తాన్ని ప్రైవేటు పెట్టుబడికి కట్టుబడేలా చేయడం ఎలా అభివృద్ధి అవుతుందో అర్థం కాదు. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలను, ఇతర ప్రజాస్వామ్య కీలక అంగాలను రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ప్రజలను మతపరంగా చీల్చి పాలించడం కూడా బిజెపి వారి దేశ ప్రగతి వ్యూహమే. అభివృద్ధికి పర్యాయంగా ఊడిపడిన వారి మరో పదబంధం జంటఇంజిన్ల ప్రగతి. దీనినే ఇంగ్లీషులో డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

అంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో వుంటే ఆ రాష్ట్రం విశేష అభివృద్ధిని చూరగొంటుందని అర్థం. కేంద్రంలో ఇప్పుడు అధికారంలో వున్నది తామే కాబట్టి రాష్ట్రాల్లో కూడా తమనే ఎన్నుకుంటే ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి రాష్ట్రాలను ముందుకు పరుగెత్తిస్తామని ప్రగతి పథంలో దూసుకుపోయేలా చూస్తామని చెప్పడం. అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూసి వెనుకబడినవాటిని ముందుకు తీసుకురాడానికి తగిన అదనపు చేయూత ఇవ్వడం కేంద్రంలోని పాలకుల విధి. ఇందుకు ఏమేమి చేయాలో రాజ్యాంగం ప్రకారం తగిన ఏర్పాట్లు కూడా వున్నాయి. వాటిని విస్మరించి, పూర్తిగా పక్కన పెట్టి బిజెపి పాలిత రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపే వివక్షాపూరితమైన పాలనను కేంద్ర పాలకులు ఇప్పుడందిస్తున్నారు. ఉదాహరణకు సెంట్రల్ కర్నాటకలోని విస్తృత ప్రాంతానికి నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి దాని అమలుకు రూ.12,500 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాణధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను చిరకాలంగా పట్టించుకోడం లేదు. పొరుగునున్న ఆంధ్ర ప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ దానిని మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నది. తమ పార్టీకి అధికారం కట్టబెట్డడమో, తమ చెప్పుచేతల్లో మెసులుకోడమో చేస్తేగాని ఏ రాష్ట్రానికీ న్యాయమైన సాయం చేయకూడదనేది కేంద్రంలోని బిజెపి పాలకుల దుష్ట సంకల్పమని సందేహాతీతంగా బోధపడుతున్నది. దీనినే వారు డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటున్నారు.

అంటే రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడి ప్రజలు బిజెపిని గెలిపిస్తేనే వారికి మంచి రోజులు సిద్ధిస్తాయని లేకపోతే అంతే సంగతులని చెప్పడమే కదా! ప్రజల పెడరెక్కలు విరిచికట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోడమే కదా! అటువంటి డబుల్ ఇంజిన్ గ్రోత్ అదృష్టాన్ని సంపాదించుకున్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల కంటే అనేక రెట్ల విశేషాభివృద్ధిని తెలంగాణ సాధించిన సంగతి తాజాగా మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం రూ.71 వేలయితే, తెలంగాణలో అది రూ.2.78 లక్షలు, యుపి ఆర్థికాభివృద్ధి రేటు 7.2 శాతం అయితే తెలంగాణది 10.8 శాతం. డబుల్ ఇంజిన్ గ్రోత్ వున్న యుపిలో 2017 నుంచి 2021 వరకు వృద్ధి రేటు 25.6 శాతంగా నమోదైతే సింగిల్ ఇంజిన్ గ్రోత్ గల తెలంగాణలో అది 55.46 శాతం. ప్రసవ సమయంలో తల్లుల మరణాల రేటు యుపిలో 167 కాగా, తెలంగాణలో కేవలం 56. అలాగే శిశు మరణాల రేటు ఉత్తరప్రదేశ్‌లో 41 కాగా, తెలంగాణలో 23. కేంద్రంలోని బిజెపి పాలకులు మత పిచ్చి ప్రదర్శిస్తూ, రాష్ట్రాల అధికారాలను కాజేస్తూ సంస్కరణల పేరిట ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని సొంత వనరులతో, స్వయం కృషితో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి అనితరమైనది. ఇటువంటి రాష్ట్రాల్లో పాలకులు అందిస్తున్న విజ్ఞతాయుతమైన పాలనను, చిత్తశుద్ధితో సాగిస్తున్న అభివృద్ధి కృషిని నిరుత్సాహపరచడానికి కేంద్ర పాలకులు ఎన్ని డబులింజిన్ గ్రోత్‌ల వంటి కుయుక్తులను ప్రయోగించినా విజయం సాధించలేరు.

BJP Followed Double Engine growth

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News