లక్నో(యుపి) :బీజేపీ నేతలు పరమాత్ముడు శ్రీరామునికి నిజమైన అనుచరులు కారని, శ్రీరాముని పేరు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని ఫైజాబాద్ నుంచి ఎన్నికైన సమాజ్‌వాది పార్టీ ఎంపీ అవదేష్ ప్రసాద్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ ఎంపీ ప్రసాద్ తన సమీప బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్‌పై 54,567 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం లోని అయోధ్యలోనే రామాలయ నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే. మర్యాద పురుషోత్తమ్ రామ్ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేసిందని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతున్న సమయంలో రామాలయ నిర్మాణం ఘనత మోడీకి దక్కుతుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ప్రచారంలో కూడా రామాలయ నిర్మాణాన్నే ప్రముఖంగా వినియోగించారు. బీజేపీ నినాదం గురించి అడగ్గా “జో రామ్‌కో లాయే హై…హమ్ ఉన్‌కో లాయేంగే ”( ఎవరైతే రాముడ్ని తెచ్చారో , వారికే మేం పట్టం గడతాం ) అన్న నినాదంతో బీజేపీ ఎన్నికల ప్రచారం సాగించింది. కానీ వారు రాముడ్ని తీసుకురాలేదు. ఇది వారి బూటకపు నినాదం. ప్రజలు దీన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఎవరూ రాముడ్ని తీసుకురాలేదు. రాముడు తనకు తానే కొన్నివేల సంవత్సరాల క్రితం వచ్చాడు” అని అవదేష్ ప్రసాద్ పేర్కొన్నారు. “ ప్రతివారి హృదయంలో రాముడున్నాడు. ప్రతివారి నమ్మకానికి రాముడు మూలం. వారు (బీజేపీ) రాముడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు.
ఆ విధంగా దేశాన్ని మోసగించారు. ” అని అవదేష్ ప్రసాద్ విమర్శించారు. తనకు తాను నిజమైన రామభక్తునిగా అభివర్ణించుకుంటూ అయోధ్యలో తాను జన్మించడం తన అదృష్టం, అక్కడే చదువుకున్నాను. నా తాత, తండ్రి, సోదరుడు, మేనమామ, అంతా రాముని పేరుతో ఉన్న రామభక్తులే ” అని తన కుటుంబీకుల వివరాలు తెలియజేశారు. తాను పోటీ చేసిన నియోజకవర్గంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా చూసిందన్నారు. దేశంలో రామరాజ్యం తెస్తామన్న బీజేపీ హామీ గురించి ప్రస్తావిస్తూ రామరాజ్యంలో ప్రజలు ఎలాంటి బాధలకు గురి కాలేదని, బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం లేదా నిరుద్యోగం ఇలా ఏదోఒక విధంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల రిక్రూట్‌మెంట్ అగ్నిపథ్ పథకంపై విమర్శలు గుప్పిస్తూ దీనివల్ల మన దేశ సైన్యం అవమానమొందారని విమర్శించారు.