Thursday, December 12, 2024

ఒళ్లొంచితేనే కల ఫలించేది!

- Advertisement -
- Advertisement -

రాష్ర్టంలో భారతీయ జనతా పార్టీ ఇకనైనా కుదురుకునేనా? మందలింపుతోనే సరిపెట్టుకోకుండా, బిజెపి కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తే కుదురుకునే అవకాశం ఉండొచ్చేమో! ఎందుకంటే, వాళ్లు కల్పించుకొని ఒత్తిడి పెంచేదాకా ఏదీ జరుగటం లేదు. ఏకంగా అధికారంలోకే వస్తామని ప్రధాని అంతటి నాయకుడు అంచనా వేసిన ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడింది? అన్నది, అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ సమీక్షించుకోలేదు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు 8 సీట్లకే ఎందుకు పరిమితమైంది? అన్న సమీక్ష లోతుగా జరుగలేదు. ఏదో పైపై ప్రసంగాలు, ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుల ఉపన్యాసాలతో సాగిన భేటీ తప్ప కూలంకషమైన చర్చే జరుగలేదు. గ్రూపు తగాదాల వల్లే ఎన్నికల ముందర రాష్ర్ట నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చిందని స్వయానా మోడీయే చెప్పారు. బిసిని సిఎం చేస్తామంటూ, మరోవంక బిసి నాయకుడిని అధ్యక్ష పదవినుంచి నిష్కారణంగా తప్పించారనే ఇన్నాళ్ల నిందకు, జవాబు దొరికినట్టయింది.

ఎపుడో అడిగిన అనుమతి ఇటీవల దొరికి ప్రస్తుత సమావేశాల సందర్భంగా, పార్లమెంట్ భవనంలోని కార్యాలయంలో తెలంగాణ బిజెపి నాయకులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి, ఐక్యంగా పనిచేసి గెలిచిన హర్యానా, మహారాష్ర్ట ఎన్నికల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనతో బెంబేలెత్తి ఉన్న తెలంగాణ ప్రజలకు స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ పాలనతో మొహం మొత్తిందని, నాయకులంతా కలిసికట్టుగా, ప్రణాళికాబద్ధ్దంగా పనిచేసుకుంటే బిజెపికి చక్కని అవకాశముంటుందని ఆయన ఉద్బోధించారు. గత ఎన్నికల్లోనే బిజెపి గెలుస్తున్నట్టు తనకు సమాచారం ఉందన్న ఆయన, ‘ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యలు చేయడం, నాయకుల మధ్య పరస్పర కుట్రల వల్ల కార్యకర్తల్లో నెలకొన్న ఆయోమయం, అంతిమంగా పార్టీకి జరిగిన నష్టం’ అనే అంశాల కోణంలోనే మాట్లాడారు. ఇదివరకటిలా అందరితో మాట్లాడించడం కాకుండా, ఈసారి తానే అధికంగా మాట్లాడారు. తాజా భేటీలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అదే రోజాయన చేసిన ట్వీట్, క్షేత్రంలోని వాస్తవాలతో అన్వయించి చూస్తే పరిస్థితులు బోధపడతాయి.

తప్పుల మీద తప్పులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 40 మందికి పైగా ఇప్పుడు బిజెపిలో లేరు, పార్టీ వీడి వెళ్లారు. దీర్ఘకాలంగా పార్టీని పట్టుకొని ఉన్న వారికి కాకుండా, బయటి నుంచి వచ్చిన వారికే మెజారిటీ స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వడం వల్ల వారికి నిబద్ధతలేక ఇలా జరుగుతోంది. వచ్చినవారిలో అత్యధికులు ‘సొంత లాభం’ చూసుకుంటున్నారు. పార్టీ అనుబంధ విభాగాలైన యువమోర్చా, మహిళా మోర్చాల వారికి టిక్కెట్లే ఇవ్వలేదు. పార్టీ చేపట్టే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనేది, లాఠీ దెబ్బలు తిని అరెస్టయేది మాత్రం వాళ్లు. లోక్‌సభకు పోటీ చేసిన 17 మందిలో 15 మంది బయటి నుంచి పార్టీలోకొచ్చి పోటీపడ్డవాళ్లే! దక్షిణాది రాజకీయ పరిస్థితులు బోధపడని బిజెపి అధిష్టానం, తరచూ ‘ఉత్తర భారత’ రాజకీయ శైలిని, విధానాలను, పేర్లను రుద్దడం కూడా ఇక్కడ వికటిస్తోంది. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పనికొస్తుందని వ్యూహాత్మకంగా ‘మునుగోడు’ ఉప ఎన్నిక తెచ్చినా, సమయ ఎంపిక, సన్నద్ధత లేక తొందరవల్ల చేజారింది.

అది ఒక ఉప ఎన్నిక ఓటమిగానే కాక, రాష్ర్టంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు, గోడమీదున్న పలువురు రాజకీయ నాయకులు బిజెపిని కాదని కాంగ్రెస్ వైపు మళ్లడానికి ఆస్కారం కల్పించింది! కడకు రాజగోపాల్‌రెడ్డి కూడా పార్టీలో మిగలలేదు. పార్టీ మాత్రం, కండువా కప్పుకోక ముందే అతన్ని అభ్యర్థిగా ప్రకటించి, తర్వాత అమిత్ షా స్వయంగా వచ్చి, ఎన్నికల సభలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఐక్యంగా ఉండి ప్రజలకు భరోసా కల్పిస్తూ వారితో ఉండాల్సిన సమయంలో సొంత ఎజెండాలతో, స్వీయ వ్యాఖ్యలతో రాష్ర్ట నాయకులు వాతావరణం పాడు చేశారనే భావన ప్రధానిది. ఎలాంటి తప్పులు జరిగాయి, వాటినెలా సరిదిద్దుకోవాల్సి ఉండిందో ఆయన వివరించారు. ఇప్పుడు పార్టీ విస్తరిస్తోందని, కేంద్రంలో ఎన్‌డిఎ సాధించిన అభివృద్ధిని, రాష్ర్టంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజామద్దతు మరింత కూడగట్టాలని పార్టీ నాయకులకు మోడీ పిలుపునిచ్చారు.

‘సంస్థాగత’ పురోగతి అంతంతే
బిజెపి రాష్ర్ట కొత్త అధ్యక్షుడెవరు? అన్నది ఆర్‌ఎస్‌ఎస్ వారి సిఫారసులను బట్టే ఉండొచ్చు. సభ్యత్వాల నమోదు కూడా ఆశించిన స్థాయిలో లేక, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ వచ్చాక కొంత వేగం పెరిగింది. శివ ప్రకాశ్‌జీ మొత్తమ్మీద ఇంచార్జీగా ఉన్నారు. బూత్‌స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు జరుగుతోంది, బహుశా ఈ నెలాఖరుకి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగియవచ్చు. మండల, జిల్లా, రాష్ర్ట స్థాయిలో అధ్యక్షులుగా ఎన్నికవటానికి, కనీసం 15 ఏళ్లు పార్టీ క్రియాశీల సభ్యులై ఉండాలనే యోగ్యత ప్రస్తావనకు వస్తోంది. ఈ నిబంధనకు కట్టుబడితే, రాష్ర్ట కొత్త అధ్యక్ష పదవికి ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు ఎంపిలు రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, డికె అరుణల ఎంపికకు ఇబ్బందిరావచ్చు. మాజీ ఎంఎల్‌సి రామచంద్రరావు విషయంలో ఇబ్బందేమీ ఉండదు. ఇంకేవైనా కొత్తపేర్లు తెరపైకి వస్తాయా చూడాలి. కిందటి ఎన్నికల్లో పార్టీ పొందిన ఓట్లలో కనీసం 50 శాతం సభ్యత్వాలుండాలన్న లక్ష్యాన్ని నాగర్‌కర్నూల్, కరీనంగర్, మేడ్చల్ వంటి కొన్ని జిల్లాలే సాధించాయి.

వారే, తమ కమిటీలను ఎన్నికల ప్రక్రియతో ఏర్పరచుకోవచ్చని, మిగతా వాటికి ఢిల్లీ నాయకత్వం సూచిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న నాయకుల జోక్యాలు కొన్నిచోట్ల అనివార్యమైతే, మరికొన్ని చోట్ల బిజెపి నాయకులకు మింగుడు పడటం లేదు. 2018 ఎన్నికలప్పుడు మొదట రూపొందించిన జాబితాలో గోషామహల్ ఎదురుగా రాజాసింగ్ పేరు లేదు. ‘ఆయన పేరెందుకు లేదు?’ అని అమిత్ షా అడిగి, సవరిస్తే అప్పుడొచ్చింది. ఆ ఎన్నికల్లో విచిత్రంగా అతనొక్కడే గెలిచాడు. డా. లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కూడా సొంత నియోజక వర్గాల్లో ఓడిపోయారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక/ఎంపిక విషయంలో రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘శ్యావ్‌ుజీ (ఆలె నరేంద్ర సోదరుడు) లాంటి వాళ్లను అధ్యక్షులుగా పెట్టాల’ంటూ వ్యంగ్యంగా అన్నారని అభియోగం వచ్చింది. పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ‘ప్రెస్ కాన్ఫరెన్స్’లు పెట్టే విషయంలోనూ వివాదాలొస్తున్నాయి. మోడీ చెప్పినట్టు పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయికి వెళ్లాయంటే, పార్టీ కార్యదర్శి (సంస్థాగత)గా ఉన్న మంత్రి శ్రీనివాస్ వ్యవహార శైలి గిట్టని కొందరు ఆయన్ని రాష్ర్టం నుంచి పంపించే దాకా అవిశ్రాంత కృషి చేశారు.

ఎన్నికల్లో గెలుపోటములు మామూలే అనేది రాజకీయ స్లోగన్! తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బిజెపికి ఎంత సవాలో అంతటి అవకాశమే! ప్రధాని ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని అమలుపరచి, పార్టీగా లబ్ధి పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక అవకాశంగా వాడుకోవచ్చు. సీనియర్ నాయకులు స్పర్ధలు వీడి, ఐక్యంగా ఉంటూ… సర్పంచి, ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో శ్రద్ధ వహిస్తే ఒక వ్యవస్థ బలోపేతమవుతుంది. కిందిస్థాయి కార్యకర్తలకూ రాజకీయ అవకాశాలు పెరిగి, సంస్థాగతంగా పార్టీ బలపడుతుంది. ఒక ఎన్నిక ఫలితం సానుకూలత మరో ఎన్నికల్లో లబ్ధినివ్వటం లేదు. సిట్టింగ్ ఎంపిలైన ‘బడా నేతల’ పార్లమెంటు సీట్లలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కూడా నెగ్గకపోవడాన్ని పార్టీ శ్రేణులు వింతగా చూస్తున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచినా సాధారణ ఎన్నికల్లో అవి పార్టీకి దక్కలేదు.

వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేతను ఒక నాయకుడు పట్టుబట్టి సిరిసిల్ల (పాత కరీంనగర్ జిల్లా)కు తెచ్చుకుంటే, ఉస్మానియా యూనివర్శిటీలో పార్టీ అనుబంధ విభాగ విద్యార్థులపై కేసులు పెట్టించిన మాజీ మంత్రి ఒకరిని మరో నాయకుడు అంబర్‌పేటకు తెచ్చుకున్నారు. ఆ ఇద్దరూ ఓడిపోయారు. గెలుపు సుస్థిరం అవాలంటే ‘బడా నేత’ల పలుకుబడుల కన్నా కార్యకర్తల వ్యవస్థ బలంగా ఉండాలి. ‘8 అసెంబ్లీ, 8 లోక్‌సభ సీట్లు కలిస్తే 88 అనుకుంటున్నారు మా వాళ్లు, పదహారు మంది కలిసి కూర్చొని పార్టీ బాగుకు ఆలోచించింది లేదు’ అన్న పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరి మాటలు తెలంగాణలో బిజెపి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంస్థాగతంగా, ప్రజాదరణపరంగా బలపడితేనే పార్టీకి ఎన్నికల రాజకీయాల్లో మనుగడ!

(రచయిత పొలిటికల్ అనలిస్ట్,
డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News