Wednesday, January 22, 2025

శివరాజ్ సింగ్‌కు బిజెపి చెక్ పెడుతోందా?

- Advertisement -
- Advertisement -

రెండు జాబితాల్లోను అభ్యర్థిత్వం ప్రకటించని అధినాయకత్వం
ముగ్గురు కేంద్ర మంత్రులను బరిలోకి దించిన పార్టీ
ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకేనంటున్న కొన్ని వర్గాలు
మధ్యప్రదేశ్‌లో వేడెక్కుతున్న రాజకీయం

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ రాజకీయ వేడి రాజుకుంటోంది. బిజెపి రాష్టరంలో మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనన్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు విడతల్లో 78 మంది అభ్యర్థులను ప్రకటించింది.

జాతీయ స్థాయి నేతలను కూడా అసెంబ్లీ బరిలోకి దించుతోంది.ముగ్గురు కేంద్ర మంత్రులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చిందంటే వ్యూహాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తోందో అర్థమవుతుంది.అయితే ఇప్పటివరకు విడుదల చేసిన రెండు జాబితాల్లోను ముఖ్యమంత్రి, అందరూ ముద్దుగా ‘మామ’ అని పిలిచే శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికలకు ఆయన దూరంగా ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది మరికొద్ది రోజులు పోతే కానీ తెలియదు.

అయితే శివరాజ్ సింగ్ రాజకీయ భవిష్యత్తుపై ఈ పరిణామాల క్రీనీడలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ సుదీర్ఘకాలం సేవలందించారు. అపార రాజకీయ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి పేరు తొలి రెండు జాబితాల్లోను లేకపోవడం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దీనికి తోడు కేంద్రమంత్రులను బరిలోకి దించడం చౌహాన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలను సంధిస్తోంది. బిజెపి అధిష్ఠానవర్గం తీసుకున్న తాజా నిర్ణయాలు చౌహాన్‌కు హెచ్చరికగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక వేళ పార్టీ త్వరలో విడుదల చేయబోయే జాబితాల్లో శివరాజ్ సింగ్ పేరు ఉన్నా ముఖ్యమంత్రి రేసులో ఆయన ఉండకపోవచ్చని పార్టీలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకే కీలక నేతలను బరిలోకి దించుతున్నట్లు సమాచారం. అయితే పార్టీలోని మరికొన్ని వర్గాలు మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు టికెట్ కేటాయించబోరన్న వాదనను ఖండిస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే కీలక నేతలనుపార్టీ బరిలోకి దించుతోందని వారంటున్నారు. బిజెపి తాజాగా విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్థే పేర్లను ఖరారు చేసింది. ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాల్లో ఒక్క సిట్టింగ్ మంత్రి పేరు కూడా లేకపోవడం గమనార్హం.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ వర్గీయ కూడా అసెంబ్లీ బరిలో ఉండడం గమనార్హం. ఆయన దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం విశేషం. అభ్యర్థుల విషయంలో బంధుప్రీతిని అరికట్టాలనే ఉద్దేశంతోనే బిజెపి అధిష్ఠానం ఈ తరహా చర్యలు తీసుకుంటోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ ఎదుట ప్రజల్లో తమకున్న బలాన్ని నిరూపించిన వారికే టికెట్లు కేటాయించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.

కేంద్రంలో బిజెపిని గద్దె దించేందుకు ఏర్పాటయిన ‘ఇండియా’ కూటమి వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోను కలిసే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కమలం పార్టీ సత్తా ఉన్న నేతలను ఏరికోరి మరీ బరిలోకి దించుతోంది. ఇదే వ్యూహాన్ని త్వరలో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లోను అమలు చేయనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బిజెపి అధిష్ఠానం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా గత నెలలో 39 మందితో తొలి జాబితాను ప్రకటించిన బిజెపి అధిష్ఠానం సోమవారం రాత్రి మరో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది.

బిజెపి ముందే ఓటమిని అంగీకరించింది: కమలనాథ్
కాగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నియోజకవర్గాన్ని ప్రకటించకపోవడం, ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. బిజెపి తన ఓటమిని అంగీకరించిందంటూ ఈ పరిణామాన్ని విశ్లేషించింది. తమకు కోట్లాది మంది కార్యకర్తలున్నారని, 18.5 సంవత్సరాలు బిజెపి ప్రభుత్వంలో .. ఇందులో 15 ఏళ్లు శివరాజ్ సింగ్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని బిజెపి చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను చూస్తేనే అర్థమవుతుందని, బిజెపి తన ఓటమిని ముందే అంగీకరించిందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సిఎం కమలనాథ్ ఓ ట్వీట్‌లో అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో మునిగిపోతున్న నావను కాపాడేందుకే కేంద్ర నాయకులందరినీ బిజెపి బరిలోకి దింపుతోందన్నారు. తాము ఓడిపోతున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా తెలుసునని, అందుకే రాజకీయంగా తనకు పోటీదారులైన బడా నేతలందరినీ ఆయన బరిలోకి తెచ్చారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News