Sunday, December 22, 2024

‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా

- Advertisement -
- Advertisement -

BJP government done nothing for Telangana:KTR

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా

తెలంగాణ నిధులతో బిజెపి
పాలిత రాష్ట్రాలకు సోకులు
ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల
చెమట, నెత్తురు ధారపోసి
కేంద్రానికి రూ. 3,65,797
కోట్లు పన్నుల ఇచ్చాం
అక్కడి నుంచి మనకి
వచ్చింది రూ.1,68,647
కోట్లు మాత్రమే
బండి సంజయ్‌లు
ఎగిరేగిరి పడుతున్నారు
మేం కూడా మోడీని బట్టేబాజ్
లుచ్చా అనలేమా? మాకు
మా అధినేత కెసిఆర్
సంస్కారం నేర్పారు మేం
నోరు విప్పితే మాకు సాటి
ఎవ్వరూ ఉండరు
కరీంనగర్‌లో ఎన్నికైన బండి
సంజయ్ అక్కడ ఏం పీకలేక
పాలమూరులో
తిరుగుతున్నాడు: హన్మకొండ
బహిరంగ సభలో కెటిఆర్

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. ఇక్కడ నుంచి లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో వెళుతున్నా రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా చూపుతున్నారని.. నేను మాట్లాడినదాంటో తప్పని నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటానని టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విసిరారు. హన్మకొండ కుడా గ్రౌండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధుల బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు ఏం చేయని ఈ మోదీ, ఆయన పార్టీ మనకెందుకన్నారు. మోదీ ఇస్తున్న పైసలతోనే మన ప్రభుత్వం నడుస్తోందని ఓ చిల్లరగాడు మాట్లాడుతున్నారంటూ.. మన నుంచి వెళుతున్న నిధులతోనే మోడీ ప్రభుత్వం కులుకుతుందని దెప్పిపొడిచారు. మంత్రిగా చెబుతున్నా.. ఇది తప్పు అయితే మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా వదిలేస్తానని బిజెపి నేతలకు సవాల్ విసిరారు. ఏడేండ్ల కాలంలో మన ప్రజల చెమట, రక్తం ధారపోసి పన్నులరూపంలో కేంద్రానికి రూ.3లక్షల 65వేల 797 కోట్లు ఇస్తే.. అక్కడి నుంచి మనకు వచ్చింది కేవలం రూ.లక్షా 68వేల 647 కోట్లేనన్నారు.

ఇక్కడి నుంచి వసూలు చేసిన పైసలు బిజెపి పాలిత రాష్ట్రాలలో సోకులు చేసుకుంటున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. తాను చెప్పింది తప్పైతే మంత్రి పదవిని వదలిపెట్టి ఎంఎల్‌ఎగా కొనసాగుతానన్నారు. ఇంతలా మన నిధులను వేరే చోట ఖర్చు చేస్తుంటే రాష్ట్ర బిజెపి నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. నేను చెప్పింది తప్పని బిజెపి నాయకులు రుజువు చేయాలని సవాల్ విసిరారు. నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడే రేవంత్, బండి సంజయ్‌లు ఎగిరెగిరి పడుతున్నారని, వీళ్లు మాట్లాడినట్టుగా.. మోదీని బట్టేబాజ్ అని, లుచ్చాగాడు అని అనలేమా అంటూ.. మాకు మా అధినేత కెసిఆర్ సంస్కారం నేర్పారని, నోరు విప్పితే.. మా కంటే ఎవరూ బాగా మాట్లాడలేరని కెటిఆర్ అన్నారు. కరీంనగర్‌లో నెగ్గిన బండి సంజయ్ అక్కడ ఏం పీకలేక.. పాలమూరులో తిరుగుతున్నాడన్నారు. ట్రిఫుల్ ఐటిని తీసుకురాని దద్దమ్మ పాలమూరును ఏం ఉద్ధరిస్తాడని నిలదీశారు. బిజెపి పార్టీ నేతలు బేకర్ గాళ్లు ఆనలేమా అన్నారు. ప్రధాని మోడిని కలిసి మాట్లాడే దమ్ము కూడా రాష్ట్ర బిజెపి నేతలకు లేదన్నారు.

ఒకవేళ తెలంగాణకు చెందిన బిజెపి నేతలకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే దేశంలో అమలుజరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్రానికి ఎందుకు తీసుకురావడం లేదన్నారు. టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను టార్గెట్ చేసుకొని కాంగ్రెస్, బిజెపి నేతలు చేస్తున్న ఎదురుదాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టకపోతే టి కాంగ్రెస్, టి బిజెపి పార్టీలు ఉండేవికాదని, ఆ పదవుల్లో రేవంత్, బండి సంజయ్ ఉండేవారా అని, అవి కెసిఆర్ పెట్టిన భిక్షేనన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు మంజూరైతే రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీని ఎందుకు మంజూరు చేయించలేదన్నారు. వాటితో పాటు కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, బిజినెస్ స్కూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఐఐటి లాంటి అత్యున్నతమైన విద్యాసంస్థలను రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసిన కేంద్రం ఇప్పటి వరకు దానిపై ఊసెత్తడం లేదన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి వాపును చూసి బల్పు అనుకోవడం సరైంది కాదన్నారు.

తెలంగాణ రాష్ట్రం త్యాగాల మీద ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1971లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 371 మంది అమరులై 11 పార్లమెంటు స్థానాలను ఉద్యమకారులు గెలిపించుకుంటే వారంతా అమ్ముడుపోయారన్నారు. అక్కడితోనే తెలంగాణ ఉద్యమం ఆగిపోయిందన్నారు. ధనం, అంగబలం, కండబలం ఏదిలేని కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 2001లో పార్టీని స్థాపించి అంకుటిత దీక్షతో రాష్ట్రాన్ని సాధించారన్నారు. అలాంటి గడ్డను ఏలేందుకు బిజెపి, కాంగ్రెస్‌లు ఇప్పడు తహతహలాడుతున్నాయన్నారు.

తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. జూన్ 2 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తవుతుందని అలాంటి పసిగుడ్డును తన్నిన మోడీ, రాష్ట్ర అభివృద్ధిపై బిజెపి నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విభజన హామీలు అమలుచేసే దమ్ము లేకపోగా, రాముని జపం చేస్తూ రాముని పరిధిలోని ఏడు మండలాలను ఆంధ్రాలో ఎలా కలిపారని కెటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నూకలు చెల్లాయన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని పొందారని గుర్తు చేశారు. బిజెపి, కాంగ్రెస్‌లకు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని ఎద్దెవా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ప్రజల అభ్యున్నతి కోసమన్నారు. దానికోసమే మట్టిపనికైనా మనోడే ఉండాలన్న చందంగా టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిదిశలో పయనింపచేస్తుందన్నారు.

దాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. ఇటువంటి ప్రచారాను తిప్పికొట్టే బాధ్యత పార్టీ శ్రేణులదేనని పిలుపునిచ్చారు. రెండుసార్లు ప్రజలచేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సిఎం కెసిఆర్‌ను ఇష్టం వచ్చిన భాషలో కాంగ్రెస్, బిజెపినేతలు మాట్లాడుతున్నారని.. ఇకమీదట అలా మాట్లాడితే సహించేదిలేదని కెటిఆర్ హెచ్చరించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చావు అంచుల్లోకి వెళ్లి తెలంగాణను సాధించిన ఉద్యమకారులకు బిజెపి, కాంగ్రెస్ నేతల బూపు పురాణాన్ని తిప్పికొట్టడం పెద్ద లెక్కెంకాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను 67 సంవత్సరాలు పరిపాలించిన పాలకులు చేయలేని అభివృద్ధి ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో జరిగిందన్నారు. ఒక మున్సిపాలిటికి రూ.కోటి అభివృద్ధికి కేటాయిస్తే.. తెలంగాణలో రూ.వంద కోట్ల నిధులు వస్తున్నాయన్నారు.

ఇది కేవలం స్వయం పరిపాలనవల్ల వచ్చిన అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే పరాయిల పీడన లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఎదిగిందన్నారు. ఈ పార్టీకి ఎదురులేదని, టిఆర్‌ఎస్‌ను ఢీకొట్టే శక్తి అన్ని పార్టీలు ఏకమైనా సాధ్యం కాదన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయభాస్కర్‌లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మూడేండ్లలో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను నిర్మిస్తే వాటికి జాతీయ హోదా కేంద్రం ప్రకటించలేదన్నారు. రాష్ట్రం కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో ఒక్క శాతం కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలేదని వారు కేంద్రం తీరును దుయ్యబట్టారు. సభలో ఎంపిలు మాలోతు కవిత, ఎంఎల్‌సిలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News