Saturday, November 23, 2024

బిజెపి ప్రభుత్వాన్ని వాళ్లు ఫ్యాక్షనిస్టుల మాదిరిగా తయారు చేశారు: నారాయణ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో
బిజెపి ప్రభుత్వాన్ని ఫ్యాక్షనిస్టుల మాదిరిగా తయారు చేశారు…
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శ
అక్టోబర్ 1418 తేదీలలో
విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభలు
అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరుతో నిర్వహించే
జాతీయ సెమినార్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆహ్వానం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో బిజెపి ప్రభుత్వాన్ని ఫ్యాక్షనిస్టుల మాదిరిగా తయారు చేసారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. మొన్నటి వరకు కులం, మతం పేరుతో విభజించిన బిజెపి, ఇప్పుడు ప్రత్యర్థులను, వ్యతిరేక పార్టీలను ఫ్యాక్షనిస్టుల మాదిరిగా సిబిఐ, ఈడీ, ఐటిలతోవెంటాడుతున్నాయని ఆరోపించారు. ఇది ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలకు కూడా విరుద్ధమని చెప్పారు. దేశ రాజకీయాలలో, విధానాలలో జరుగుతున్న మార్పు నేపథ్యంలో అక్టోబర్ 14 – 18 తేదీలలో విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ మహాసభలు ప్రాముఖ్యత సంతరించుకున్నదన్నారు. బిజెపి వ్యతిరేక పార్టీల మధ్య జాతీయ స్థాయిలో ఐక్యత బలపడేందుకు ఈ మహాసభ ద్వారా ప్రయత్నం జరగనుందని తెలిపారు.

అందులో భాగంగానే మహాసభ జరిగే సమయంలోనే అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్ ’ పేరుతో నిర్వహించే జాతీయ సెమినార్ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మగ్దూంభవన్ బుధవారం నాడు రాష్ట్ర మహాసభ తరువాత తొలిసారిగా సిపిఐ నూతన రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి వేదికపై ఆసీనులయ్యారు.

తొలుత సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు ఇటీవల మరణించిన సోవియెట్ యూనియన్ మాజీ అధ్యక్షులు మిహాయెల్ గోర్బచెవ్, మాజీ ఎంఎల్ భూపతిరావు , సిపిఐ సీనియర్ నాయకులు లింగారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు, సాహితీవేత్త నిజాం వెంకటేశ తదితరులకు నివాళి అర్పిస్తూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, రాష్ట్ర సమితి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సిపిఐ జాతీయ మహాసభకు 20 దేశాల నుండి సౌహార్థ ప్రతినిధులు హాజరుకానున్నట్లు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. విజయవాడలో జాతీయ మహాసభ ప్రారంభ సూచికగా అక్టోబర్ 14న బహిరంగ సభ జరగనుందని చెప్పారు. మహాసభ జయప్రదానికి తెలంగాణ పార్టీ కూడా భాగస్వామి అయిందని, బహిరంగ సభకు ఇక్కడ నుండి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా సిపిఐ బలోపేతానికి మహాసభ ఒక ముందడుగు అని , నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.

విజయవాడలో 47 ఏళ్ళ తరువాత మరోసారి సిపిఐ జాతీయ మహాసభ జరుగనుందని అజీజ్ పాషా తెలిపారు. ప్రతిపక్షాల ఐక్యతపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్న కీలక సమయంలో సిపిఐ మహాసభ జరగనుందని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యంగా ఉంటే 2024లో మోడీ ఏమి చేసినా తిరిగి అధికారంలోకి రాడని, ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుందన్నారు. ప్రజాసమస్యలపై ఉద్యమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి మొహమాటం లేకుండా పోరాడుతామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మతతత్వ బిజెపిని నిలవరించేందుకు మునుగోడులో టిఆర్ కు మద్దతునిచ్చామని, అదే సమయంలో ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో మహిళల శిరోముండనం ఘటనను వదిలిపెట్టబోమని, సాంఘిక దురాచారాలపైన, ప్రజాసమస్యలపైన రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, పేదలకు ఇళ్ళ స్థలాల కోసం పోరాటాలను కొనసాగించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News