Monday, January 20, 2025

తెలంగాణ చేనేతపై చిన్నచూపు

- Advertisement -
- Advertisement -

BJP Govt neglect to Telangana Handloom sector

సంప్రదాయ కులవృత్తులపై పన్నుల భారాన్ని మోపుతూ పాలకులు వృత్తికారుల జీవనాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నారు. మరో పక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కులవృత్తుదారులకు చేరువ చేయలేకపోవడంతో పాత పద్ధతులతో ముందుకు సాగుతూ ఆశించిన మేరకు ఉత్పత్తిని అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో బహుళ జాతి పెట్టుబడిదారులు కులవృత్తులను హైజాక్ చేస్తూ పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. వృత్తిదారుడి జీవితం మాత్రం ఎదుగు బొదుగు లేకుండా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా ఉంది. దీనికి తోడు పన్నుల పెంపు మరింతగా కుంగదీస్తున్నది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చేనేతరంగం నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానాలలో చేనేత రోజురోజుకీ కత్తిమీద సాములా మారింది. తెలంగాణ రాష్ర్టం కొంత మేరకు వివిధ పథకాల ద్వారా చేనేత కళాకారులకు భరోసా ఇస్తున్నప్పటికీ కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో చేనేతాభివృద్ధి కుంటుపడుతున్నది. జౌళి రంగంలో కేంద్ర మంత్రిమండలి కొత్తగా ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది.

పలు ప్రాజెక్టుల కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నది. పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర చేనేత, జౌళి శాఖల మంత్రులను రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్, చేనేతశాఖ మంత్రి కెటిఆర్‌లు కలిసి రూ. రెండు వేల కోట్లు అందించాలని అభ్యర్థించారు. అయినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కేంద్రం ఐదేళ్లలో రూ.10,683 కోట్లు వెచ్చించేలా ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటీవ్ (పిఎల్‌ఐ) పథకంలో తెలంగాణకు చోటు దొరకడం కాస్త ఊరట కలిగించింది. తెలంగాణ రాష్ర్టంలో పేరెన్నికగన్న చేనేత రంగాన్ని సంస్థాగతంగా ముందుకు తీసుకుని వెళ్లడానికి ప్రభుత్వం వివిధ ప్రాయోజిత పథకాలను రూపొందించి అములు చేస్తున్నది. వీటిలో ప్రధానమైనవి 20 శాతం హాంక్ నూలు, రంగులు సబ్సిడీ, పావలా వడ్డీ పథకం, మార్కెటింగ్ ప్రోత్సాహక పథకం, టెస్కో ఎక్స్‌గ్రేషియా, చేనేత మిత్ర పథకం, క్యాష్ క్రెడిట్ పెంపుదల, చేయూతతో పాటు ఏడాది పాటు పని కల్పనలో భాగంగా బతుకమ్మ, ఇతరత్రా వస్త్రాలు, చీరల రూపకల్పన తదితరమైనవి. ఈ పథకాలకుగానూ రూ. 73,42,58,232 నిధులను కేటాయించింది. దీంతో నేత, అనుబంధ కార్మికుల తలసరి ఆదాయాలు వృద్ధి చెందడమే కాకుండా రాష్ర్టంలోని చేనేత సహకార సంఘాలు పరిపుష్టిగా రూపొంది, నేతకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం కలిగింది.
చేనేత, జౌళి రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయూత నివ్వకపోవడంతో ప్రగతిశీల రాష్ర్టంగా ఉన్న తెలంగాణకు వనరుల కొరతతో కునారిల్లుతున్నది. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టును 2017లో ప్రారంభించింది. రెండున్నర వేల కోట్ల రూపాయాలతో నిర్మాణం చేపట్టింది. మౌలిక వసతుల కోసం కేంద్ర మెగా జౌళి పార్కుల పథకం కింద వెయ్యి కోట్ల రూపాయల సాయాన్ని కోరింది. దీంతో పాటు సిరిసిల్ల జిల్లాలో మెగా మరమగ్గాల సమూహం (పవర్‌లూవ్‌ు క్లస్టర్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర సమగ్ర మరమగ్గాల సమూహాల అభివృద్ధి పథకంలో రూ. 994 కోట్లను అభ్యర్థించింది. అలాగే మరమగ్గాల అభివృద్ధి సంస్థ స్థాపన కోసం మరో రూ.756 కోట్లు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం కోరింది. ఇదిలావుండగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎల్‌ఐ పథకం కింద జిల్లాల్లోని మూడు, నాలుగో శ్రేణి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కేంద్ర సాయం అందనుంది. రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులకు భూమి, పరిపాలన భవన నిర్మాణం, పరిశ్రమ, యంత్రాలు, పరికరాల కొనుగోళ్లకు సాయం లభించనుంది. కాకతీయ, సిరిసిల్ల జౌళి పార్కులు పల్లె ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించిన మరమగ్గాల అభివృద్ధి సంస్థలో పరిపాలన భవనం, యంత్రపరికరాల కొనుగోళ్ల వంటివి చేపట్టవలసి ఉంది. దీంతో రెండు ప్రాజెక్టుల్లోని పరిశ్రమలకు, అలాగే మరమగ్గాల అభివృద్ధి సంస్థకు కేంద్ర పథకం అనుకూలంగా ఉందని అధికార వర్గాలు భావిస్తున్నారు.

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మెగా పవర్ లూం క్లస్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూం టెక్నాలజీ, బ్లాక్‌లెవల్ క్లస్టర్‌లను మంజూరు చేయించుకోవాలనే ఆశతో రాష్ర్ట ప్రభుత్వం పావులను కదుపుతున్నది. దుబ్బాక, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, సిద్దిపేట, ఆర్మూర్, మహదేవ్‌పూర్, కొత్తపేట తదితర చేనేత ప్రాంతాల్లో ఏ ఒక్కచోటయినా ఇండియన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ హ్యాండ్‌లూం టెక్నాలజీ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరింది. అయితే తాజాగా కేంద్ర చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకురాలు వెలువరించిన ప్రకటనలో తెలంగాణ సహా దేశం లో కొత్తగా ఏ రాష్ర్టంలోనూ జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూవ్‌ు టెక్నాలజీ ఐఐహెచ్‌టీ) ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఒడిశాలోని బర్‌గఢ్ ఐఐహెచ్‌టిలో ఏటా తొమ్మిది మంది తెలంగాణ విద్యార్థులను తీసుకునేందుకు అనుమతినిచ్చినట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరి ఐఐహెచ్‌టిలోనూ రాష్ర్ట కోటా కింది తెలంగాణ వారిని చేర్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు వివరించింది.

దీంతో తెలంగాణలో ఇప్పట్లో ఐఐహెచ్‌టి వచ్చేట్లు లేదని స్పష్టమవుతున్నది. 40 వేలకు పైగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తెలంగాణకు ఇది తీరని కోరికగానే మిగిలిపోయింది. చేనేతలో నైపుణ్య కోర్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కుకు ‘పిఎం మిత్ర’ లో వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరినా స్పందన లేదు. అలాగే పోచంపల్లి, గద్వాల, నారాయణపేట తదితర ప్రాంతాల్లో బ్లాక్ లెవెల్ క్లస్టర్లలో అక్కడి చేనేత కళాకారులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ చేనేతపై కేంద్రం చూపు సారించడం లేదు. ఇప్పుడు జిఎస్‌టిని 12 శాతానికి పెంచడం చేనేత, జౌళి రంగంలోని చిన్న పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ. ‘భారత్‌లో తయారీ’ నినాదానికి వ్యతిరేకమైనది. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు చేనేతరంగం అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సాయం అందడం లేదు. తెలంగాణ రాష్ర్ట చేనేత, జౌళిశాఖల మంత్రి కెటిఆర్ జిఎస్‌టి దుష్పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన శూన్యం. అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ ఉన్న మన చేనేత ఉత్పత్తులకు రక్షణ, నేతన్నలకు అండగా నిలబడవలసి ఉంది. సృజనాత్మక కళానైపుణ్యం, దేశ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలిచిన చేనేత రంగంపై దృష్టి సారించి, అభివృద్ధికీ అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు జీరో జిఎస్‌టి దిశగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చేనేతకారులు కోరుతున్నారు.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News