దేశంలో ఎక్కడ చూసినా అంబేడ్కర్ పేరు నేడు వినిపిస్తున్నది. అయితే వినిపించే వారెవరనుకున్నారు? భారతీయ జనతా పార్టీ అంబేడ్కర్‌ను భుజాన వేసుకొని మోస్తున్నది. అంబేడ్కర్‌ను తెగ పొగిడేస్తున్నారు. అన్ని పార్టీలు, అందరు రాజకీయవాదులు అంబేడ్కర్‌ను గౌరవిస్తుండగా ఇక కావాల్సిందేమున్నది? సామాజిక న్యాయం రాకేం చేస్తుంది? అనేవి నేటి ప్రశ్నలు. అయితే ఒకసారి జాగ్రత్తగా చరిత్రను పరిశీలిస్తే హిందూ మతం హింసతో జంతుబలులు చేస్తూ యజ్ఞయాగాదులు జరుపుతూ ఉన్న రోజులలోనే బౌద్ధం పుట్టింది. అహింసావాదాన్ని ప్రచారం చేసింది. సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులు పోవాలని, స్త్రీపురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది. అందుకే ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు. ఆదరించారు. అనుసరించారు.
ఇక అప్పుడేం జరిగింది? హిందూ మతం పునరుద్ధరణ పేరిట, రాజుల సహాయంతో శంకరాచార్యులు మొదలైనవారు బౌద్ధాన్ని చంపేశారు. బౌద్ధ భిక్షువులను నాశనం చేశారు. బౌద్ధ ఆరామాలను కొన్ని చోట్ల దేవాలయాలుగా మార్చారు. 20వ శతాబ్దంలో అంటరానితనాన్ని పాటించే హిందూ సమాజం ప్రపంచం దృష్టిలో తలవంపులకు గురైంది. అలాంటి స్థితిలో అంబేడ్కర్ వచ్చి కూలంకషం గా హిందూ సమాజంలోని దోషాల్ని పరిశీలించారు. వాటి పై పోరాడారు. అంటరాని కులాలు, శూద్రులు సమాజంలో గణనీయంగా వున్నారు. వారి ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలవదు గనుక కొత్త ఎత్తుగడలతో, తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా నేడు అంబేడ్కర్‌ను తెగపొగిడేస్తున్నారు. అది విని అటు షెడ్యూల్డ్ కులాలు, ఇటు శూద్రకులాలు సంతోషపడి ఓట్లు వేయాలనేది బిజెపి ఉద్దేశం. అంబేడ్కర్ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు.
కానీ పొగుడుతూ, గోతులు తవ్వి అంబేడ్కర్‌ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే, జాగ్రత్తపడాలి. ఆ విషయం శ్రద్ధగా, లోతుగా పరిశీలించాలి. అంబేడ్కర్ పేరిట కొందరు బయలుదేరి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ, విగ్రహాలు ప్రతిష్ఠించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేడ్కర్‌వాదులను సంతప్తిపరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే. అది కూడా అంబేడ్కర్ వాదాన్ని ఉరితీయడానికి పన్నుగడే. ఈ విషయం గ్రహించడానికి అంబేడ్కర్‌వాదులకుకొంతకాలం పట్టొచ్చు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది. అంబేడ్కర్‌కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు. బిజెపి తమ ఎత్తుగడలో అంబేడ్కర్ ని కూడా చేర్చడం గమనార్హం. కానీ ఈ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేడ్కర్‌లో బిజెపి ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు.
కేవలం ఓట్ల కోసమే బిజెపి అంబేడ్కర్‌ను శ్లాఘిస్తున్నా, అది మరీ కృత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనేవుంది. ఇటీవలే బిజెపి వారు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించారు. రామరాజ్యం నిర్మిద్దాం అంటూ, అయోధ్య మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు రాళ్ళు మోసుకొని వెళ్ళారు కూడా. కానీ అంబేడ్కర్‌ను పొగుడుతూ, ఆయన ఆశయాలను పాటిస్తామంటున్న బిజెపివారికి అసలు విషయం తెలియదనుకోలేం గదా! అందులో బాగా చదువుకున్న నాయకులు, అనుచరులు ఉన్నారు. వారిలో అందరూ కాకున్నా, కొందరైనా అంబేడ్కర్ రచనలు చదివి వుంటారు. హిందూ మతాన్ని గురించి, రాముడిని, రామాయణాన్ని గురించి అంబేడ్కర్ రాసింది వారి దృష్టికి వచ్చే వుంటుంది. అంబేడ్కర్ రచనలలో అముద్రితంగా వున్న రచనలు కొన్ని మహారాష్ర్ట ప్రభుత్వం ప్రచురించగా, అందులో రాముడి గురించిన విషయమై పెద్ద ఆందోళనే జరిగింది. బిజెపి, శివసేన, హిందూ ఛాందసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు.
కనుక అంబేడ్కర్‌లో బిజెపి వారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి. ఫలానా విషయం తృణీకరిస్తున్నామంటే, ఎందుకో కారణాలు కూడా బిజెపి చెప్పాలి. ఇదేమీ చేయకుండానే బిజెపి హఠాత్తుగా అంబేడ్కర్ వర్ధంతులు, జయంతులు జరుపుతూ ఊరేగింపులు చేస్తుంటే ప్రయోజనం ఉండదు. అంబేడ్కర్ కేవలం ద్వేషంతో, పగతో హిందువులలో అగ్రవర్గాల వారిని, ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు. సుదీర్ఘంగా పరిశోధించి, ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు. పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు. మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష, క్రూర, ఘోర నియమాలు, నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు చూపారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్ధిస్తున్న ధర్మాలను అంబేడ్కర్ చూపారు.
ఇవేవీ తెలియనట్లు బిజెపి నటిస్తోందా? లేక అవన్నీ మరచిపోదాం అంటోందా? అంబేడ్కర్ ఆశయాలు అమలు జరగాలంటే, కొన్ని శాస్త్రాల్ని, గీతను, వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను, ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి. అంతేగానీ కేవలం అంబేడ్కర్‌ను పొగిడితే అది ఓట్ల వ్యూహంగానే భావించాలి. హిందూమతం ప్రజాస్వామిక విలువలకు చోటు పెట్టడం లేదని అంబేద్కర్ ఫిలాసఫి ఆఫ్ హిందూయిజంలో స్పష్టం చేశారు. సాంఘిక న్యాయానికి తోడ్పడని హిందూమతాన్ని అమానుషమైనదిగా సహజంగానే అంబేడ్కర్ నిర్ధారించాడు. బిజెపివారు అంబేడ్కర్ తత్వాన్ని, వాదనల్ని ఏ మేరకు అంగీకరిస్తున్నారో, ఎక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలి. అంటరానితనం పోవాలి అని చిలుకపలుకులు ఉచ్ఛరిస్తే సరిపోదు. అంబేడ్కర్‌ను వాడుకుని ఓట్లు తెచ్చుకుందామనే బిజెపి ఆలోచనల్ని దేశ ప్రజలు పసిగట్టి తిప్పికొట్టకపోతే నష్టపోయేది ప్రజలే.
నాదెండ్ల శ్రీనివాస్
9676407140