Friday, December 20, 2024

రూ 1.15 లక్షల కోట్ల బకాయిలు చెల్లించండి: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

అలీపురుదువార్ : పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ 1.15 లక్షల కోట్ల బకాయిలు రావల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. వెంటనే ఈ బకాయిలు చెల్లించాలి. లేదా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని ఆమె డిమాండ్ చేశారు. నిధులు అయినా ఇవ్వండి లేదా వైదొలగండని స్పష్టం చేశారు. అలీపుర్‌దువార్‌లో జరిగిన సభలో మమత బెనర్జీ మాట్లాడారు. బకాయిల విషయాన్ని తాను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లుతున్నట్లు, తక్షణం ఆయన అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించారు. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్‌లో ఉండటం భావ్యమేనా అని ప్రశ్నించిన మమత , ఈ విషయాన్ని తాము ప్రజల వద్దకు తీసుకువెళ్లుతానని స్పష్టం చేశారు. పేదల సొమ్ము తిరిగి ఇస్తారా? ఇంటికి వెళ్లుతారా? అనే నినాదంతో తాము ముందుకు సాగుతామని హెచ్చరించారు.

ఈ నెల 18 నుంచి 20 మధ్యలో మోడీతో భేటీకి వీలుందని, ఈ మేరకు సమాచారం పంపించామని మమత తెలిపారు. తాను తన వెంట కొందరు ఎంపిలు ఢిల్లీకి వెళ్లుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దక్కాల్సిన పలు స్థాయిల బకాయిలు తొక్కిపెట్టి తమాషా చేస్తోందని, వీటిని ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేయడం జరిగితే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వీలుండేదని మమత తెలిపారు. రోజ్‌గార్ యోజన, హౌసింగ్, ప్రత్యేకించి జిఎస్‌టి ద్వారా రాష్ట్రానికి రావల్సిన వాటా అన్ని కలిపితే ఇంత భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపొయ్యాయని , వీటిపై కేంద్రంలోని మోడీ సారధ్యపు బిజెపి ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని మమత నిలదీశారు. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 93 కోట్ల రూపాయలు విలువచేసే 70 పనులను ప్రకటించారు. తమది బిజెపి కాదని, టిఎంసి అని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ అని మమత స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News