మన తెలంగాణ, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుండటంతో బిజెపి నేతలకు మైండ్ బ్లాక్ అవుతుందని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని విమర్శించారు. దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. పగటి వేషగాళ్ల మాటలు ప్రజలు నమ్మరని, రాష్ట్ర సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి సిఎం కెసిఆర్ ప్రశంసించారు.
ఏదో ఎన్నికల ముందు సభలు, సమావేశాలు పెట్టుకుని పబ్బం గడిపేవారు కాదని, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి రాలేదన్నారు. ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చిన విషయాన్ని కాషాయం నేతలు గ్రహించాలని చురుకలు వేశారు. బిఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బ తీయాలన్న కుట్రలు, కుతంత్రాలు పనిచేయవని, తెలంగాణ సమాజం గురించి అమిత్‌షాకు ఏం తెలుసుని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు చెప్పుడు మాటలు వినకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తున్నామో ఎలాంటి పథ కాలు అమలు చేస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ఎస్పై విమర్శలు మానుకోకుంటే మునుముందు తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొడుతారని విరుచుకపడ్డారు.