ప్రధాని మోడీకి కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి పరాజయం చెందడంతో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. అహంకారాన్ని విడనాడి, మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేసి, పెట్రోల్, డీజిల్ లూటీని ఆపాలంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రజావేదన పాలకులకు హానికరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా మంగళవారం ప్రధానికి హితవు చెప్పారు. మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని బిజెపి కోల్పోయిందని, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష పోటీలో దాదాపు అన్ని చోట్ల బిజెపి చిత్తుగా ఓడిపోయిందని ఆయన ట్వీట్ చేశారు.
ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులను అభినందించిన ఆయన బిజెపి నిష్క్రమణ అనివార్యమని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్‌లో మండి లోక్‌సభ స్థానం, ఫతేపూర్, అర్కి, జుబ్బల్-కోట్‌కై అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. రాజస్థాన్‌లో ధరియావాడ్ అసెంబ్లీ స్థానంతోపాటు కర్నాటకలో హంగల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింద. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అన్ని స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.