Monday, December 23, 2024

మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!

- Advertisement -
- Advertisement -

దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన తమ పరిపాలనను అరమరికలు లేకుండా వినియోగించుకొంటున్నది. షరియత్ చట్టం, ఎన్‌ఆర్‌సి, జమ్మూకశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాలను ఉదాహరణగా చూపవచ్చును.ఇంకా ఆ ఎజెండాలో రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగ సవరణ, ఒకే జాతి-ఒకే దేశం ఇత్యాది అంశాలు ఉండే అవకాశం లేకపోలేదు!? బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇప్పుడు ఒకింత ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతున్న సందర్భం లేకపోలేదు! తాజాగా రాహుల్ గాంధీ అంశమే తీసుకుంటే రాహుల్ పార్లమెంటులో, బయట బిజెపి దృష్టిలో కొరకరాని కొయ్యగా తయారయ్యారు.

రాఫేల్ డీల్ విషయంలో, ఆదానీ విషయంలో గానీ, బ్రిటన్ యూనివర్శిటీలో చేసిన ప్రసంగాలు, రాహుల్ సూటి విమర్శలను బిజెపి అధినేతలు తట్టుకోలేకపో యారని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగిన పాదయాత్ర కాంగ్రెస్ ప్రతిష్ఠను నిలకడచేసింది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో రాహుల్‌ను ఓ ఎత్తుగడ గానే దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. రాహుల్ 2019 లో కర్ణాటకలో చేసిన ప్రసంగం, గుజరాత్‌లో కేసు, దేశం విడిచి పారిపోయిన మోడీలపై రాహుల్ వ్యాఖ్యానంపై రెండు ఏళ్ళు జైలుశిక్ష విధించడం, తెలుగు నాట నేటి రాజకీయ విమర్శలు స్థాయి చూసిన ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది? వెనువెంటనే పార్లమెంటు నుంచి రాజీవ్ గాంధీని గెంటివేయడం, ఆయన అధికార నివాసం ఖాళీ చేయడం కోసం ఇచ్చిన నోటీసును దేశ సామాన్య ప్రజలు సైతం జీర్ణించుకోలేనిదిగా ఉంది.
బిజెపికి కాంగ్రెస్‌కు సమాన దూరంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ లాంటి రాజకీయ పక్షాలు కూడా ఈ చర్యను తీవ్రంగానే నిరసించాయి.

ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థలను సంతలో కూరగాయల్లా అమ్మేయడం, అదానీ లాంటి వారి అక్రమాలు వెనకేసుకు రావడం కేంద్రంలో మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రబలింది. సిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, మహారాష్ట్ర రైతు సహకార ఎన్నికలలో బిజెపి ఓటమి, కర్ణాటక ఎన్నికల్లో ఎదురుగాలి బిజెపి పతనం అంచుల్లో నడుస్తున్న జాడలు కనిపిస్తున్నాయి? అందుకే అందినకాడికి మతతత్వ ఎజెండాపైనే బిజెపి దృష్టి సారించిందని చెప్పవచ్చును. ఇప్పుడే ఇదిలా ఉంటే 2024 సాధారణ ఎన్నికల నాటికి ఇంకెంత రాద్ధాంతం చూడాల్సి ఉంటుందోనన్న ఆందోళన ప్రజాస్వామ్యవాదులలో నెలకొంది. గ్యాస్, పెట్రోల్ ధరలు విషయంలో బిజెపి ప్రతిష్ఠ మసక బారింది. నల్లధనం వెనక్కి తెచ్చే విషయం ఉత్తడొల్ల మాటలు ప్రజలకు అవగతమైంది. ధరలు ఆకాశం అంటుతున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోయింది.

రాహుల్ గాంధీకి సానుభూతి పవనాలు చుట్టుముట్టాయి. అది తుపానుగా మారి 1977 నాటి రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుతుందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే, శ్రమ లేకుండా ప్రతిపక్షాలను బిజెపి కాంగ్రెస్‌కు చేరువ చేసింది. ప్రజాస్వామ్య విఘాతం గురించి మాట్లాడుతున్న ప్రస్తుతం ప్రతిపక్షాలు తమ దాకా వస్తేగాని స్పందించలేకపోయాయి. బీమా కోరేగావ్ పేరుతో మేధావుల నిర్భంధం, మోడీ హత్య కుట్ర పేరుతో అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి వృద్ధుడు, రచయిత వరవరరావు, వికలాంగుడైన సాయిబాబాను జైళ్ళలో వేసి ఏళ్ళ తరబడి విచారణ తంతుకొనసాగిస్తున్నారు!? అంతేకాదు దళితులు, ముస్లిం, క్రైస్తవ వర్గాల మీద, వారి ఆహారపు అలవాట్లపై మూకదాడులు, సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం, పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బిబిసిపై ఐటి దాడులు చేసిన సందర్భంలో, అప్పుడే ఆయా రాజకీయ పక్షాలు సీరియస్‌గా తీసుకుని ఉన్నట్లయితే బిజెపిలో ఇంత బరితెగింపు ఉండేది కాదు!? ఇక ప్రతిపక్షాలన్నీ అవినీతిమయమైనవి అని చెప్పడానికి సిబిఐ, ఇడి, ఐటిలను ఉసిగొల్పుతున్న తీరు గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ చేయనంత దుర్వినియోగం కనిపిస్తుంది.

చివరకు ప్రతిపక్ష పార్టీ ప్రజాభిప్రాయం కనుగుణంగా, కేబినెట్ ఉమ్మడిగా చేసిన నిర్ణయాలను సైతం లిక్కర్ కుంభకోణం పేరుతో వ్యాపారులను నెలల తరబడి జైళ్ళలో పెట్టి, ప్రతిపక్షాలు ఆప్, బిఆర్‌ఎస్ లాంటి పార్టీలను బద్నాం చేయగలిగినంత చేశారు. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్, బెంగాల్‌లో మమతా బెనర్జీ సన్నిహితులు, శివసేన ఎంపి సంజయ్ రౌత్, కర్ణాటకలో పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, తమిళనాడులో ముఖ్యమంత్రి కూతురుపై ఐటి దాడులు, ప్రతిపక్షాలపై సిబిఐ కేసులు ఈ కోవలోనే!? నిజంగా ప్రతిపక్షాలు అవినీతిమయమైనవి, అధికార పక్షం స్వచ్ఛమైనదా? లేదు! అసోంలో బిశ్వంత్ శర్మ, ఈశాన్య రాష్ట్రాలలో సంగ్మా, తెలుగు రాష్ట్రంలో సుజనా చౌదరి, కర్నాటకలో యెడ్యూరప్ప ఇలా ఎంతో మంది బిబిపి తీర్థం పుచ్చుకోవడం ద్వారా పునీతులైపోయారు. ఇలా పెద్ద జాబితానే ఉంది.

అదానీ లాంటి లక్షల కోట్ల అవినీతి, మనీలాండరింగ్‌పై విచారణ జరపడానికి కనీసం అంగీకరించకపోకుండా, కేవలం ప్రతిపక్షాలును ఉద్దేశపూర్వకంగా ఇరికించి చేసే విమర్శలను నమ్మెంత అమాయకులుకారు ప్రజలు. ఇప్పుడు ఎన్నికల నిర్వాహణకు కోట్లాది రూపాయల నల్లధనం కార్పొరేట్ శక్తుల నుండి పొందుతూ విజయం సాధిస్తూ తాము పునీతులమని ఎవరు చెప్పినా నమ్మే స్థితి ఇప్పుడు లేదు!? తాజాగా మోడీ సర్టిఫికెట్ విషయంలో సమాచారం హక్కు చట్టం కింద అడిగిన అంశానికి కోర్టు కేజ్రీవాల్‌కు రూ. 25 వేలు జరిమానా విధించడం పైనా చర్చ జరుగుతోంది.

ఇలా అయితే సమాచార హక్కు చట్టం స్ఫూర్తి ఎలా నిలబెట్టుకోవడం? ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ ఫెయిల్ కావడం, బిజెపి ప్రభుత్వంపై 40 శాతం కమీషన్ ప్రచారం తీవ్రంగా ఉండడం, ఒక రకంగా రాహుల్ గాంధీపై జరిగిన చర్యలపై జాతీయవాదుల్లో బిజెపి చర్యలను నిరసించే స్థితి రావడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ‘జై భజరంగ్ దళ్’ నినాదం ఎత్తుకొంది. వాస్తవానికి కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పథకాలు, లబ్ధి గురించి చెప్పుకోవలసిన ప్రధాని కూడా భజరంగ్ దళ్‌ను రెచ్చగొట్టడానికే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులు కూలగొడదాం అందులో శవం ఉంటే మీది, శివం ఉంటే మాది లాంటి వ్యాఖ్యలు సైతం వివాదాస్పదం అయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అల్లర్లలో చర్చీలు తగులుబెడుతున్న దృశ్యాలు కానీ, ఉత్తరప్రదేశ్‌లో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఎన్‌కౌంటర్స్ కానీ, కేరళలో సినిమా రచ్చగానీ ఇవ్వన్నీ బిజెపి సమస్యలకు బదులు మతాన్ని రాజకీయ ఎజెండాగా చేయాలనే ప్రయత్నం కనబడుతోంది.

ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థలను సంతలో కూరగాయల్లా అమ్మేయడం, అదానీ లాంటి వారి అక్రమాలు వెనకేసుకు రావడం కేంద్రంలో మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రబలింది. సిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, మహారాష్ట్ర రైతు సహకార ఎన్నికలలో బిజెపి ఓటమి, కర్ణాటక ఎన్నికల్లో ఎదురుగాలి బిజెపి పతనం అంచుల్లో నడుస్తున్న జాడలు కనిపిస్తున్నాయి? అందుకే అందినకాడికి మతతత్వ ఎజెండాపైనే బిజెపి దృష్టి సారించిందని చెప్పవచ్చును. ఇప్పుడే ఇదిలా ఉంటే 2024 సాధారణ ఎన్నికల నాటికి ఇంకెంత రాద్ధాంతం చూడాల్సి ఉంటుందోనన్న ఆందోళన ప్రజాస్వామ్యవాదులలో నెలకొంది. గ్యాస్, పెట్రోల్ ధరలు విషయంలో బిజెపి ప్రతిష్ఠ మసక బారింది. నల్లధనం వెనక్కి తెచ్చే విషయం ఉత్తడొల్ల మాటలు ప్రజలకు అవగతమైంది. ధరలు ఆకాశం అంటుతున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోయింది.

సామాన్యుడి బతుకు రోజు రోజుకు దుర్భరంగా మారుతున్నది. గత యుపిఎ మన్మోహన్ ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే ఒక్క రాజకీయ కుట్రలలో తప్ప బిజెపి అన్నింటా వైఫల్యం ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక గత 7 దశాబ్దాలుగా సంపాదించిన విలువైన ఆస్తులు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసింది. విమానయానం, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ సంస్థలు, బొగ్గు, రైల్వేలు ఇలా అమ్మని ప్రభుత్వరంగ సంస్థ లేదు. మరోసారి బిజెపి అధికారంలోనికి వేస్తే ప్రజలు తప్ప ఈ దేశంలో అమ్మకానికి మరో సంస్థ మిగిలే అవకాశమే లేదు? అబద్ధాలు, దుష్ప్రచారం పునాదులుపై అధికారంలోనికి రావాలనుకుంటున్న బిజెపి ప్రజాస్వామ్య పునాదులు పెకలించే పనికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు!? రాహుల్ గాంధీపై జరుగుతున్న దాడి సామాన్య ప్రజలపై జరుగుతున్న దాడిగానే ప్రజలు భావించే పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రధాని పదవిపై ఆశలు తెంచుకొని బిజెపి నియంత పోకడలను అడ్డుకునేందుకు, ఆట కట్టించేందుకు ఏకం కావాలి. అది ఇదే సరైన సందర్భం కూడాను!?

యన్ తిర్మల్
7207864514

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News