Monday, December 23, 2024

‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!

- Advertisement -
- Advertisement -

BJP in self-defense in Maharashtra

బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆయనలో కొంత అసహనం కలిగిస్తున్నట్లు భావించవలసి వస్తుంది. ఫిరాయింపులను ప్రోత్సహించి, థాకరేను గద్దె దింపగానే మహారాష్ట్రలో శివసేన పనైపోతుంది, ఇక బిజెపి ఏకఛత్రాధిపత్యం వహింపవచ్చని వేసుకున్న అంచనాలు తలకిందులవుతున్నట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే తొందర పాటుతో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ వత్తిడులతోనే తప్పటడుగులు వేశామని ఇప్పుడు మహారాష్ట్రలోని బిజెపి నాయకులే భావిస్తున్నారు. థాకరే ప్రభుత్వాన్ని పూర్తికాలం కొనసాగనిచ్చి ఉంటె, ప్రజా వ్యతిరేకతతో కొట్టుకుపోయి, బిజెపి సొంత బలంపై ఎన్నికలలో గెలుపొందే అవకాశం వచ్చెడిది. కానీ తొందరపడడంతో ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవి రాకపోగా, బిజెపి సహితం ప్రాబల్యం కోల్పోయే సంకేతాలు వెలువడుతున్నాయి.

రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తన ‘మర్యాద పూర్వక’ ప్రవర్తనతో మహారాష్ట్రలో గతంలో శివసేనకు మద్దతు పలకని విద్యావంతులు, మధ్యతరగతి ప్రజల మన్ననలు థాకరే పొందుతున్నట్లు ఇప్పుడు స్పష్టం అవుతున్నది. పార్టీ ఎమ్యెల్యేలు బిజెపి వైపు వెళ్లినా పార్టీ కార్యకర్తలు మొత్తమ్మీద ఇంకా థాకరే వెంటనే ఉండడంతో పాటు మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్‌సిపి మరింత పట్టుదలతో ఐక్యంగా ఉంటామనే సంకేతం ఇస్తున్నాయి. మొన్నటి వరకు ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తాము అంటూ వస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఉమ్మడిగా బిజెపిని ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు పార్టీలకు మూడు రాష్ట్రాలలో విభిన్న వర్గాల మద్దతు ఉంది. వారు విడిగా ఉన్నప్పుడే, 2014లో నరేంద్ర మోడీ ప్రభంజనం సమయంలోనే సొంతంగా మెజారిటీ సాధింపలేని బిజెపి, ఇప్పుడు ఆ మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తే ఎదుర్కోవడం కష్టం అని అనేక మంది బిజెపి ఎంఎల్‌ఎలు వాపోతున్నారు.

మరోవంక మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను అప్రమత్తం చేశాయి. తమ వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చడంలో ఆరితేరిన బిజెపిని కట్టడి చేయనిదే తమకు రాజకీయ మనుగడ ఉండబోదనే నిర్ణయానికి వచ్చాయి. మొదటగా బీహార్‌లో నితీశ్ కుమార్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. బీహార్ పరిణామాలు బిజెపికి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. జార్ఖండ్, ఢిల్లీలలో అధికార పార్టీలు విశ్వాస తీర్మానాలతో ముందుకు రావడం ద్వారా ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసి, ప్రత్యర్థి ప్రభుత్వాలను కూల్చడంలో బిజెపి పట్టుదల గురించి ప్రజలకు ఓ విధంగా ఆ పార్టీ పట్ల ప్రతికూల సంకేతం ఇచ్చిన్నట్లయింది. 270 మందికి పైగా ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను కూల్చడం కోసం బిజెపి రూ. 6,400 కోట్లతో ‘ఆపరేషన్ లోటస్’ జరిపిందని అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేస్తే బిజెపి అధినేతలు ఎవ్వరూ మాట్లాడలేక పోతున్నారు.

బెంగాల్‌లో ఇద్దరు జార్ఖండ్ ఎంఎల్‌ఎలను భారీగా నగదుతో పట్టుకోవడం గమనిస్తే హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసమే ఎంఎల్‌ఎల కొనుగోలు జరుగుతున్నట్లుగా పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు బిజెపిలో చిరకాలంగా పని చేస్తున్న నాయకులకు సహితం మింగుడు పడటం లేదు. నేడు దేశానికి అవినీతి పెద్ద శత్రువని కేరళ పర్యటన సందర్భంగా హెచ్చరించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆ మరుసటి రోజునే మంగళూరు సభలో అదే మాట అనలేకపోయారు. ఎందుకంటె మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర చోట్ల బిజెపి ప్రభుత్వాలే తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. బిజెపిలో చేరగానే అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ వంటి వారిపై ఆధారాలు సేకరించి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుకు సాగకపోవడం గురించి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే బిజెపి నాయకులెవ్వరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. గతంలో వలే ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ముందుకు బిజెపి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పార్టీ నాయకులు పార్టీ పదవుల కోసం, కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కోసం పార్టీ కార్యకర్తల నుండే నాలుగు రాష్ట్రాలలో కోట్ల రూపాయలలో ముడుపులు వసూలు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. స్వయంగా మాజీ ఐపిఎస్ అధికారి అయిన తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై ఫిర్యాదు చేయడంతో ఎపి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు. ఒకవంక ఆ నాయకులు అరెస్టు నుండి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుండగా, మరోవంక ఈ ఉదంతపై పార్టీ నేతలు ఎవ్వరూ నోరు మెదిపే సాహసం చేయలేకపోతున్నారు. ఒబిసిల మద్దతుతో తమ సీట్లు పెంచుకొంటూ వస్తున్న బిజెపికి ఇప్పుడు ఆ వర్గాల మద్దతు గల పార్టీలు అన్ని బీహార్‌లో ఒక్కటై, తమకు కేవలం అగ్ర వర్గాలను మాత్రమే మిగల్చడం ఊహించని షాక్ ఇచ్చింది. ఆ ప్రభావం పొరుగునున్న యుపిపై కూడా ఉంటుంది. దేశంలో అత్యధికంగా ఎంపి సీట్లు గల బీహార్, మహారాష్ట్రలతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా గెలుపొందే సీట్లు తగ్గిపోతే ఆ లోటు ఎక్కడ భర్తీ చేసుకోవాలన్నది ఇప్పుడు బిజెపి ముందున్న పెద్ద సమస్య.

బిజెపి వర్గాల అంచనా ప్రకారమే ప్రస్తుతమున్న సీట్ల 50 నుండి 70 సీట్లను కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్, హర్యానా, చివరకు గుజరాత్‌లలో కూడా గతంలో వలే అన్ని సీట్లు గెలుకోవడం సాధ్యం కాదు. కేవలం మహారాష్ట్ర పరిణామాలే ఇటువంటి దుస్థితికి కారణమని చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలపై బిజెపి ఎంతగా దృష్టి సారించినా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదు. తెలంగాణ, ఒడిశాలలో సహితం రెండు, మూడు సీట్లకు మించి అదనంగా గెలుచుకునే అవకాశాలు లేవు. ఉద్ధవ్ థాకరే అధికారం కోల్పోయినా హిందు త్వ సంస్థలు ఆయన వైపే ఇంకా చూస్తుండటం గమనార్హం. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌తో సంబంధం ఉన్న పలువురు ఈ మధ్య మాతోశ్రీకి వెళ్లడం పెరుగుతున్నది. ఈ పరిణామం సహితం బిజెపికి మింగుడు పడటం లేదు. ఇప్పటి వరకు సిబిఐ, ఇడిలను ప్రయోగించి పలువురు ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు చెందిన నాయకులను బిజెపిలోకి చేర్చుకొనే ప్రయత్నాలు విజయవంతంగా చేయగలిగారు. కానీ ఇప్పుడు వాటి భయం కూడా కనిపించడం లేదు.

తన ఇంట్లోనే ఈ దర్యాప్తు సంస్థలకు ఒక గది ఇస్తానని, అక్కడనే ఉండి తమపై దర్యాప్తు జరుపుకోవచ్చని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఎద్దేవా చేయడం చూశాము. మహారాష్ట్రలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఇంటిపై ఇడి దాడి చేయగానే భయంతో ఉద్ధవ్ థాకరే రాజకీయంగా లొంగిపోతారని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. రోజంతా సోదాలు జరిపినా సంజయ్ రౌత్ ఇంట్లో ఎటువంటి ఆధారాలు సంపాదింపలేకపోయారు. పైగా, స్వయంగా థాకరే రౌత్ ఇంటికి వెళ్లి ఈ దుర్మార్గ రాజకీయాలను ప్రతిఘటిస్తామని అంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఈ దాడులతో శివసేన పట్ల ప్రజలలో మరింత సానుభూతి కలుగుతున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఎంతగా సోదాలు జరిపినా నిర్దుష్టమైన ఆధారాలు సంపాదించిన దాఖలాలు లేవు. సిబిఐ, ఇడిలు మరెంతగా దాడులు జరిపితే తమకు అంతగా ఓట్ల శాతం పెరుగుతుందని కేజ్రీవాల్ ఎద్దేవా చేస్తున్నారు. వీటికి భయపడబోమని రాహుల్ గాంధీ, కెసిఆర్ వంటి వారు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని గత ఐదేళ్లలో ఎందరు ప్రయత్నాలు జరిపినా చెప్పుకోదగిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ మహారాష్ట్ర పరిణామాల తర్వాత భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తున్నది. నితీష్ కుమార్ ఇటీవల ప్రతిపక్ష నేతలతో సమావేశమైన సందర్భంగా వారి నుండి ఐక్యత కోసం చేసిన విజ్ఞప్తికి వచ్చిన సానుకూల స్పందన లభించడం గమనార్హం.

ఈ పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్‌డిఎపై ఢీ కొనేందుకు ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 2014లో నరేంద్ర మోడీ ఇచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ కు విశేష స్పందన సాధారణ ప్రజల నుండి లభించింది. దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చి వేసింది. ఇప్పుడు అదే బాటలో కెసిఆర్ ‘బిజెపి ముక్త్ భారత్’ అని పిలుపు ఇవ్వడం పూర్తిగా మారిన రాజకీయ నేపధ్యాన్ని వెల్లడి చేస్తున్నది. తాజాగా, అసలు ఆట పశ్చిమ బెంగాల్ నుంచే మొదలవుతుందని మమతా బెనర్జీ ప్రకటించారు. తాను నితీశ్, అఖిలేశ్, హేమంత్ సొరేన్‌తో పాటు ఇతర మిత్రులంతా చేతులు కలుపుతామని చెబుతూ ఇక బిజెపి వచ్చేసారి ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సవాల్ చేస్తున్నట్లు ప్రశ్నించారు. కేవలం మహారాష్ట్రలో వేసిన తొందర పాటు అడుగులే ఇప్పుడు బిజెపికి జాతీయ స్థాయిలో పెను సవాళ్లు విసురుతున్నట్లు వెల్లడవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News