Thursday, December 19, 2024

జమిలిపై కమలనాథుల వ్యూహం

- Advertisement -
- Advertisement -

జమిలి ఎన్నికలపై తన లక్ష్యసాధన దిశగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తొలి అడుగు వేసింది. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’కు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి సాధించడం ద్వారా చట్టపరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇది బిజెపి పదేళ్ల కల. గత రెండు దఫాలు పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు ఈసారి మెజారిటీ మార్కును దాటలేక, భాగస్వామ్యపక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. అయినా జమిలి ఎన్నికలపై దూకుడును తగ్గించకపోవడం ఆశ్చర్యకరం. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయమై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. జమిలి ఎన్నికల అమలు కోసం ఉద్దేశించిన బిల్లులు రాజ్యాంగ మౌలిక స్వభావంపై దాడి చేస్తున్నాయంటూ విపక్షాలు విరుచుకుపడగా, అబ్బే అలాంటిదేమీ లేదంటూ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ నమ్మబలికారు. జమిలి ఎన్నికల వల్ల రాజ్యాంగ మూల స్వరూపానికి గానీ, సమాఖ్య వ్యవస్థకు గానీ భంగం వాటిల్లదన్నారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలను ఆయన నివృత్తి చేస్తే బాగుండేది కానీ, కీలకమైన ప్రశ్నలకు సమాధానం దాటవేయడాన్ని బట్టి, బిల్లును ఎలాగైనా గట్టెక్కించడమే కమలనాథుల ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘కేంద్ర ప్రభుత్వం పడిపోతే రాష్ట్రప్రభుత్వం కూడా ఎందుకు పడిపోవాలి?, ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల చేతిలోంచి తప్పించి, ఎన్నికల సంఘానికి కట్టబెట్టడం సబబేనా?’ అంటూ విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలు ఆలోచించదగినవే. సామదానభేదోపాయాలను ప్రయోగించి తాము అనుకున్నది సాధించుకోవడం బిజెపి పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మంది ఆమోదం తప్పనిసరన్న సంగతి కేంద్రంలోని పెద్దలకు తెలియదనుకోవడం అవివేకం. లోక్‌సభలో జమిలి బిల్లుల ప్రవేశానికి తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక వారి వ్యూహం వేరు. బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సాధారణ మెజారిటీ సరిపోతుంది. అందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు. బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తాయన్నదీ కమలనాథులు ముందుగా ఉహించినదే. అందుకనే, అడిగినదే తడవు సరేనంటూ అధికారపక్షం తలూపింది. వాస్తవానికి రాజ్యాంగ సవరణ బిల్లును జెపిసికి పంపించాలంటూ మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రే స్వయంగా అభిప్రాయపడ్డారట. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి)నియామకానికి విపక్షాలు పదేపదే డిమాండ్ చేసినా, సభను అనేక మార్లు స్తంభింపజేసినా ఒప్పుకోని ప్రధాని అండ్ కో, జమిలి ఎన్నికల బిల్లుపై అడగకముందే అంగీకరించడం వెనుక ఆలోచన వేరు. సభలో బిజెపి అత్యధిక సీట్లు గల పార్టీ కాబట్టి ఆ పార్టీ సభ్యులే సంయుక్త పార్లమెంటరీ సంఘంలోనూ ఎక్కువ మంది ఉంటారు. అక్కడ వారి మాటే చెల్లుబడి అయ్యే అవకాశం ఉంటుంది. పైగా జెపిసి నివేదిక సమర్పించడానికి 90 రోజుల గడువు ఉంటుంది. ఈలోగా ఇతర పార్టీలకు గాలం వేయడానికి తమకు తగిన సమయం ఉంటుందన్న దూరాలోచనే జెపిసి నియామకానికి కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ సకాలంలో మద్దతు కూడగట్టలేకపోతే జెపిసి గడువును పొడిగించే అవకాశం ఉండనే ఉంది. లోక్‌సభలో ఎన్‌డిఎకు ఉన్న బలం 293 మాత్రమే. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించే రోజున సభలో పూర్తి సంఖ్యలో 543 మంది సభ్యులూ హాజరైతే ఎన్‌డిఎకు 362 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. అంటే, తమకు ఉన్నసభ్యులకంటే అదనంగా మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. మొన్నటి ఓటింగ్‌లో నలుగురు సభ్యులు కలిగిన వైసిపి కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. ఇండియా కూటమిలో చేరని మరో ఆరు పార్టీలకు చెందిన తొమ్మిదిమంది ఎంపిలు జమిలి బిల్లును ప్రస్తుతానికి వ్యతిరేకించినా, వీరు చివరివరకూ అదే వైఖరికి కట్టుబడి ఉండకపోవచ్చు. మరో మూడు నెలల్లో ఇలాంటి మరికొన్ని పార్టీలను బిజెపి కూడగట్టదని అనుకోలేం. పైపెచ్చు ఇండియా కూటమిలో పొడసూపుతున్న విభేదాలు కూడా ఎన్‌డిఎకు కలసిరావచ్చు. ఇండియా కూటమి పక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించినా, జెపిసి నివేదిక సమర్పించేంత వరకూ ఈ ఐకమత్యం ఇలాగే ఉంటుందా లేక బిజెపి నేతల ప్రలోభాలకు లోనై జమిలి వైపు మొగ్గుచూపేవారు ఉంటారా అనేది వేచి చూడవలసిన అంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News