లోక్‌సభ ఎన్నికల్లో అధికార బిజెపి పార్టీని పంజాబ్, హర్యానాలో రైతులు గట్టి దెబ్బ కొట్టే సూచనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చట్టాల ఎపిసోడ్ నుంచి కమలం పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. మోడీ సర్కార్ హామీలతో ఏడాది పాటు సాగిన రైతాంగ ఉద్యమాన్ని విరమించిన అన్నదాతలు ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో కేంద్రం మోసం చేసిందని ఆగ్రహంగా ఉన్నారు. డిమాండ్ల సాధనకు చేపట్టిన ఢిల్లీ చలో ఉద్యమానికి అడ్డంకులు సృష్టించడంపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి తగిన విధంగా బుద్ధి చెబుతామని పంజాబ్, హర్యానా రైతులు హెచ్చరిక చేస్తున్నారు. బిజెపి అభ్యర్థులను ఓడించాలని, రైతు సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో అడిగేందుకు 11 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఇందులో మినిమం సపోర్ట్ ప్రైజ్ (ఎంఎస్‌పి)కి చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ, ఇటీవల చేపట్టిన ‘ఢిల్లీచలో’ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఈ దేశ రైతులను ఓట్లు అడిగే హక్కు బిజెపి పార్టీకి లేదని ఎస్‌కెయం సీనియర్ నేత, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్, బికెయు (లఖోవాల్) మీడియాతో మాట్లాడుతూ బిజెపి సర్కార్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఒక ‘రైతు, ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థకు’ వ్యతిరేక పార్టీ అని, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
ప్రజలను ఓట్లు అడిగే హక్కు బిజెపి పార్టీకి లేదని, ఆ పార్టీని ప్రజాస్వామిక, శాంతియుత పద్ధతుల్లో వ్యతిరేకిస్తామని, అన్ని ప్రజా వ్యతిరేక చర్యలలో బిజెపిని ప్రశ్నిస్తామని ప్రేమ్ సింగ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఓడించి తీరాలని వారు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి అభ్యర్థులు ఓట్లను అడగడానికి తమ వద్దకు వచ్చేవారికి ప్రశ్నించేందుకు తాము సిద్ధం చేసిన ప్రశ్నలను రెండు రాష్ట్రాల రైతులకు పంపుతామని వారు ప్రకటించారు.
ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లోకి బిజెపి నేతల ప్రవేశాన్ని పంజాబ్ ప్రజలు నిషేధం విధించి అడగడుగునా వారి రాకను అడ్డుకుంటున్నారు. ‘రైతులను ఢిల్లీలోకి రానివ్వలేదు. అలాంటప్పుడు తమ గ్రామాల్లోకి బిజెపి నేతలు ఎలా ప్రవేశిస్తారు అని ప్రశ్నిస్తూ, వారి రాకపై రైతులు నిషేధాన్ని విధిస్తున్నాం అని రైతులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల ఢిల్లీ చలో ఆందోళన కార్యక్రమంలో పంజాబ్ సరిహద్దుల్లో మరణించిన యువ రైతు శుభకరణ్‌కు నివాళిగా అనేక గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ‘నేను చేసిన తప్పేమిటి? మీ (కేంద్ర ప్రభుత్వం) హామీలను గుర్తు చేయడానికి ఢిల్లీ రావాలనుకుంటున్నాను’ అని అందులో రాసి ఉంది.
రైతులు సంధిస్తున్న11 ప్రశ్నలు
1). రైతులపైకి బుల్లెట్లు, టియర్ గ్యాస్ ఎవరు ప్రయోగించారు? 2). యువ రైతు శుభకరణ్‌ను ఎందుకు కాల్చి చంపారు? 3). ఎంఎస్‌పికి చట్టబద్ధత ఎందుకు ఇవ్వరు?
4). లఖింపూర్ ఖేరీ బాధితులకు ఎందుకు న్యాయం చేయలేదు? అజయ్ మిశ్రాను కేంద్ర కేబినెట్‌లో ఎందుకు కొనసాగించారు? 5). రైతులపై పెట్టిన కేసులను ఎందుకు ఉపసంహరించుకోలేదు? 6). కార్పొరేట్లకు అప్పులను మాఫీ చేస్తున్న మీరు రైతు రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదు? 7). అమలు చేయబోమని హామీ ఇచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టారు? 8). ‘కాలుష్య చట్టం’ పరిధి నుంచి వ్యవసాయాన్ని ఎందుకు మినహాయించలేదు? 9). ఎలక్టోరల్ బాండ్లతో దేశాన్ని కార్పొరేట్లకు ఎందుకు అమ్మేశారు? 10). భాఖ్రా, పాంగ్ డ్యాములను పంజాబ్ నుంచి ఎందుకు లాక్కున్నారు? 11). సిలోస్ ఏర్పాటు చేసి పంజాబ్‌లో మార్కెటింగ్ వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇలాంటి 11 రామ బాణాల వంటి ప్రశ్నలను పంజాబ్, హర్యానా రైతులు బిజెపి పైకి ఎక్కుపెట్టారు. భారత దేశ రైతులు, రైతు సంఘాలు, ప్రజాస్వామిక వాదులు కూడా న్యాయమైన రైతు సమస్యలను పరిష్కరించి, రైతు ప్రశ్నలకు మోడీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496