Monday, December 23, 2024

అసోం సిఎం హిమంతపై ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

కరోనా కిట్లలో భారీ అవినీతి
ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భార్య, కుమారుడి వ్యాపార భాగస్వాములకు కాంట్రాక్టు
రూ.600కు బదులు రూ.900 చెల్లింపులు
అనుభవం లేని కంపెనీకి ఆఫర్ ఇచ్చారు
ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా ఆరోపణలు

న్యూఢిల్లీ/ గువహతి : అసోంలోని బిజెపి ప్రభుత్వం చివరికి కరోనా నిర్థారణ పరీక్షల పిపిఇ కిట్లతోనూ అవినీతిని సాగించిందని ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. ఇప్పటిముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో తీవ్రస్థాయి కొవిడ్ దశలో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. ఈ దశలో అత్యంత కీలకమైన పిపిఇ కిట్స్ కొనుగోళ్ల ప్రక్రియలో భారీ ముడుపుల వ్యవహారం జరిగిందని సిసోడియా విమర్శించారు. డాక్టర్ బిస్వా భార్య, కుమారుడి వ్యాపార భాగస్వామ్య వ్యక్తులకు కిట్స్ కాంట్రాక్టు అప్పగించారని ఆరోపించారు. 2020 సంవత్సరంలో ఇతర కంపెనీల నుంచి కిట్‌కు రూ 600 చెల్లించి కిట్స్ తీసుకున్నారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఉంటుందని ఈ కాంట్రాక్టును అప్పటి ఆరోగ్య మంత్రి అయిన బిస్వా తన వారికి కట్టబెట్టారని, వారికి రూ 900 చొప్పున చెల్లింపులు జరిగాయని సిసోడియా విమర్శించారు. శర్మ భార్య కంపెనీకి ఇంతకు ముందెప్పుడూ మెడికల్ పరికరాల సరఫరా అనుభవం లేకపోయినా మంత్రి తన మాటలతో ఆయా కంపెనీలకు కాంట్రాక్టులు ఇప్పించారని, ఈ లెక్కన ఖజానాకు బిజెపి ప్రభుత్వం గండికొట్టిందని, ఇప్పుడు సిఎంగా శర్మ వచ్చారని, ఈ గత పాపం వెలుగులోకి రాకుండా చూసుకున్నారని, అయితే జాతీయ స్థాయిలో పత్రికలు ఈ అవినీతిని ఇప్పుడు వెలుగులోకి తీసుకువచ్చిందని, దీనిపై బిజెపి కేంద్ర రాష్ట్ర స్థాయి నాయకత్వాలు ఏం చెపుతాయని సిసోడియా నిలదీశారు.

కాషాయ పార్టీ నేతలు ఈ భారీ స్థాయి కుంభకోణంపై ఇప్పుడు కిమ్మనడం లేదని, బిజెపి పాలిత రాష్ట్రాలలో కరోనా దశలో ఇటువంటి పలు స్కామ్‌లు జరిగాయని, ఇవి వెలుగులోకి రాకుండా బిజెపి అన్ని అధికారిక చర్యలు తీసుకొంటోందని తెలిపారు. అయితే నిజాలు ఎప్పుడూ దాచిపెట్టడం కుదరదన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై నిరాధార ఆరోపణలు చేయడం, పైగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో తీవ్రస్థాయి చర్యలకు దిగడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పెద్దలకు పరిపాటి అయింది. బిజెపి నేతలకు అవినీతి అంశాలపై ఉన్న అవగావహన ఏమిటనేది తనకు తెలుసుకోవాలని ఉందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని, ఇప్పుడు అసోంలో జరిగిన పిపిఇ కిట్స్ అవినీతి బిజెపి పెద్దల దృష్టిలో అవినీతి అవుననుకుంటున్నారా? లేదా తెలియచేయాలని సిసోడియా డిమాండ్ చేశారు. ఇటీవలే ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఇడి మనీలాండరింగ్ అభియోగాలతో అరెస్టు చేసింది. విచారిస్తోంది. ఆయనకు ఆయన భార్యకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, వీటి లెక్కతేల్చాల్సి ఉందని ఇడి వారిని నిలదీస్తోంది. ఈ క్రమంలోనే అసోం సిఎంపై ఆప్ తీవ్రస్థాయి ఆరోపణలతో ఎదురుదాడిని పెంచింది.

కిట్స్ ఆరోపణలపై అసోం ప్రభుత్వ ఖండన
2020లో రాష్ట్రంలో కిట్స్ తయారీ కాలేదని వివరణ

అసోంలో గతంలో పిపిఇ కిట్స్ పంపిణీలో అవినీతి జరిగిందనే ఆరోపణలను అసోం ప్రభుత్వం తీవ్రంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కుటుంబానికి భారీగా లాభం దక్కేలా కిట్స్ కాంట్రాక్టులు అప్పగించారనే వార్తలు ఆరోపణలలో నిజం లేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి పిజుషు హజారికా తెలిపారు. అసలు దేశంలో కరోనా తీవ్రత దశలో అసోంలో పిపిఇ కిట్స్ ఉత్పత్తి లేదని, మరి శర్మ భార్య కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడం జరుగుతుందా? జరిగే అవకాశం లేదని, పైగా రాష్ట్రంలో అప్పట్లో ఆమె ఇతర రాష్ట్రాల నుంచి వేయి వరకూ కిట్స్ పరికరాలను తెప్పించి ఉచితంగా ఆసుపత్రులకు అందించారని రాష్ట్ర జలవనరులు, సమాచార శాఖ మంత్రి కూడా అయిన హజారికా తెలిపారు. నిరాధారమైన వార్తలను కొన్ని మీడియా సంస్థలు సంచలనానికి వెలువరించడం , వాటిని ఆధారంగా చేసుకుని కొందరు ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగడం హాస్యాస్పదం అయిందని హజారికా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News