Wednesday, January 22, 2025

రిజర్వేషన్ల పేరుతో బిజెపి మహిళలను మోసం చేస్తోంది

- Advertisement -
- Advertisement -

భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా
మన తెలంగాణ/హైదరాబాద్ : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి వెంటనే అమలు చేయకుండా బిజెపి మహిళలను మోసం చేస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా ఆరోపించారు. ప్రధాని మోడీకి నిజంగా మహిళలపై గౌరవం ఉంటే మహిళలకు రిజర్వేషన్లు 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, అమృత ఎస్టేట్స్, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఉస్తెల సృజన అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి అన్నీ రాజా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన రూపశిల్పి అప్పటి సిపిఐ పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీ అని, ముసాయిదా రూపకల్పనలో కీలక పాత్ర పోషించి అనేక సార్లు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ప్రవేశపెట్టారని, ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల ఎంపిలు అడ్డుకున్నారని, నాటి నుండి నేటి వరకు మహిళలను మోసం చేయడం ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతల రక్తంలోనే ఉందన్నారు. మణిపూర్‌లో ఘోర మానవ విషాదం చోటు చేసుకోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలేనని తెలిపారు. గత కొన్ని నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న హింసను, హత్యలను, అత్యాచారాలను అరికట్టడంలో, శాంతిని పునరుద్దరించడంలో మణిపూర్ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని, ఎలాంటి రక్షణ లేకుండా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న మహిళలు, చిన్నారుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన ఆమె వ్యక్తం చేశారు. నయా ఫాసిస్ట్ మోడీ పాలనలో దేశంలో మత సహనం క్షీణించిందని, మత స్వేచ్ఛ ఉల్లంఘనలు అంతులేకుండా పెరిగిపోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ బిజెపి ప్రభుత్వ నినాదాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయగా, మోడీ పాలనలో నవ భారతంలో మహిళలకు ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు గమనిస్తున్నారని, భారత ప్రపంచ ఛాంపియన్‌లైన మహిళా రెజ్లర్లుపై బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడడం ఇందుకు నిదర్శనం అని తెలిపారు.

బిజెపి కాషాయ పాలనలో దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న మహిళల సంఖ్య తగ్గుతోందని, మోడీ ప్రభుత్వ తిరోగమన విధానాలతో మహిళలను వారి ఇళ్ల పరిమితుల్లోకి నెట్టివేస్తోందన్నారు. హక్కులు, గౌరవం, న్యాయం, సమానత్వం కోసం పోరాడాలనే ఉక్కు సంకల్పంతో మహిళా ఉద్యమలు నిర్మించాలని అన్నీ రాజా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షురాలు పి దుర్గా భవాని, శ్రామిక మహిళా ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ పి. ప్రేమ్ పావని, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం. సదాలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎస్.ఛాయాదేవి, ముడుపు నళిని, బి. జంగమ్మ, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సహాయ కార్యదర్శి ఫైమీద, కార్యవర్గ సభ్యులు పడాల నళిని, హైమావతి, మల్లేశ్వరి, సమ లక్ష్మి, రొయ్యల గిరిజ, కె. మల్లవ్వ, పద్మ, మంజుల, సాంబ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News