Wednesday, January 22, 2025

అవినీతిపరులను ప్రోత్సహిస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

చిర్మిరి(ఛత్తీస్‌గఢ్): అవినీతిపరులను, ప్రజా సంక్షేమం పట్టని వారిని మాత్రమే బిజెపి ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ప్రజలకు 5 కిలోల రేషన్ ఇచ్చి వారు తమపైన ఆధారపడాలన్నది బిజెపి ఆలోచనని, ప్రజలు దీనికి బదులుగా ఉద్యోగాలు కోరాలని ఆమె సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలోని చిర్మిరి పట్టణంలో మంగళవారం ఒక ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ దేశానికి చెందిన ఆస్తులను నరేంద్ర మోడీ ప్రభుత్వం కొందరు కోటీశ్వరులకు కట్టబెడుతోందని ఆరోపించారు.

దేశంలో ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి, దేశంపై ఏరకంగా దాడి జరుగుతోంది, ఎటువంటి నాయకులను పెంచిపోషిస్తున్నారో దేశ ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. రెండు రకాల నాయకులను బిజెపి పెంచిపోషిస్తోందని, ఒకరు అత్యంత అవినీతిపరులని ఆమె తెలిపారు. అవినీతిపరులైన నాయకులందరినీ ఒకచోటకు చేర్చి తమ శిబిరంలోకి బిజెపి తీసుకుంటోందని ఆమె చెప్పారు. ఇతర పార్టీలలోని అవినీతి నాయకులపై మొదట ఆరోపణలు చేస్తారని, వారిపైన ఒత్తిడి పెట్టి వారిని బిజెపిలోకి రప్పించుకుంటారని ఆమె చెప్పారు. బిజెపిలో చేఇరన తర్వాత వారంతా నిజాయితీపరులై పోతారని, వారిపైన ఎటువంటి కేసులు ఉండవని ప్రియాంక తెలిపారు.

ఇక రెండవ రకం నాయకులు వారు ప్రజా సమస్యల గురించి ఎక్కడా మాట్లాడరని ఆమె అన్నారు. ధరల పెరుగుదల గురించి, ప్రజలు ఎందుర్కొంటున్న సవాళ్ల గురించి వారు మాట్లాడరని ఆమె అన్నారు. ఈ రెండు రకాల నాయకులనే బిజెపి ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు. కాని కాంగ్రెస్ పార్టీలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం పనిచేసే వారినే ప్రోత్సహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజలు ఒకపక్క తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంటే బిజెపి మాత్రం జి20, పాకిస్తాన్, చైనా వంటి భారీ ఈవెంట్లు నిర్వహిస్తుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోకు న్యాయ పత్ర అని పేరు పెట్టిందని, పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ప్రజలకు న్యాయం ఏమైనా జరిగిందా అని ప్రియాంక ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు, బడా నాయకులు మాత్రమే బాగుపడ్డారని ఆమె విమర్శించారు.

5 కిలోల ఉచిత రేషన్, మతం పేరు చెప్పుకుని మాత్రమే బిజెపి ప్రజలను ఓట్లు అడుగుతోందని ఆమె ఆరోపించారు. అధికార బిజెపిని 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని ప్రజలు అడగాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచంలోనే ఇది అత్యంత భారీ కుంభకోణమని ఆమె ఆరోపించారు. తాను మాత్రమే నిజాయితీపరుడినని, అవినీతిపై పోరాడుతున్నానని ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకుంటుంటారని ఆమె విమర్శించారు. మోడీ నిజాయితీపరుడేనని, కాని ప్రజల సమస్యల గురించి నిజాయితీగా మాట్లాడరని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎన్ని యూనివర్సిటీలు, ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మించారో నిజాయితీ చెప్పరని ఆమె వ్యంగ్యంగా అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు బిజెపి నాయకులు చెబుతున్నారని ఆమె ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News