Saturday, December 28, 2024

విద్వేష , ఉన్మాద జ్వాలలను బిజెపి రగిలిస్తోంది

- Advertisement -
- Advertisement -

‘ఆప్’ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
మణిపూర్ బిజెపి సర్కార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్
ఆప్ ’చలో రాజ్ భవన్’, అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత, అరెస్టులు

హైదరాబాద్ : మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు ప్రజల మధ్య విద్వేష, ఉన్మాద జ్వాలలు రగిలిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు, లూటీలు జరిగి వందలాది మంది మరణించి, వేలాది మంది నిరాశ్రయులయ్యారని, లెక్కలేనన్ని చర్చిలు, ప్రార్థనా స్థలాలు ధ్వంసమై మణిపూర్ రాష్ట్ర పరిపాలన ఫుర్తిగా స్తంభించినా ప్రధాని మోడీ నోరు విప్పక తన అసమర్థతను నిరూపించుకున్నాడని దుయ్యబట్టారు. మణిపూర్ బిజెపి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్, లిబర్టీ, ఆప్ రాష్ట్ర కార్యాలయం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ’చలో రాజ్ భవన్’ ప్రదర్శనను నిర్వహించింది. వందలాదిమంది ఆప్ శ్రేణులు ప్లకార్డులు చేతబూని మణిపూర్ బిజెపి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనీ, ప్రధాని మౌనం వీడాలని, చేతకాని హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, శాంతిని నెలకొల్పాలని పెద్దఎత్తున నినాదాలు చేసారు.

ఆప్ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆప్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాటలు జరిగి పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ కొంతమంది ఆప్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, మానవ హక్కుల పరిరక్షణ భావాలను నాశనం చేయడానికి కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. మణిపూర్ లో శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమై పౌరుల జీవితాలు, జీవనోపాధి, ఆస్తులకు పెద్ద ఎత్తున విఘాతం కలిగిస్తున్నా స్వయం ప్రకటిత విశ్వగురు ప్రధాని మోడీ ‘చెవిటి మౌనం‘ వహించడం దుర్మార్గమన్నారు. మణిపూర్ మంటల్లో మండుతుంటే ప్రధాని మోడి ’నిశ్శబ్దుడు’ గా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ’అసమర్థుడు’ గా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ’పనికి రానివాడు’ గా మారడం చూసి దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మణిపూర్ రాష్ట్రంలో రాజకీయ, పరిపాలనా, శాంతి భద్రతలు ఫుర్తిగా విచ్చిన్నమైనందున ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించి తక్షణమే మణిపూర్ బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నారు. ఈ ప్రదర్శనలో ఆప్ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, డా. హరి చరణ్, అధికార ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ యాదవ్, పరీక్షణ్, వినయ్, ఆప్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ రణధీర్ సింగ్ రానా, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మల్లంగి, విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సురేష్ బాబు, ఆప్ ఆటో యూనియన్ అధ్యక్షులు రుద్రాక్ష మల్లేష్, ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ టి. రాకేశ్ సింగ్, నేతలు ఆఫస బేగం, ఆర్షియా, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News