భూపాలపల్లి రూరల్: ప్రజలను మోసం చేయడంలో బిజెపి పార్టీ ముందుంటుందని, రాబోయే ఎన్నికలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అధికారమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బిఆర్‌ఎస్ ఎల్పీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ఘనంగా ముగిసాయి. గురువారం అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించుకున్నామన్నారు. బండి సంజయ్ నిన్న భూపాలపల్లిలోని చేసిన సిఎం కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. మోసం చేయడంలో కెసిఆర్‌ను మించిన తోపు లేరని బండి సంజయ్ అనడం అర్థరహితమని, మోసం చేయడంలో మోడిని బిజెపిని మించిన వారు ఉన్నారా అని ప్రశ్నించారు.
సింగరేణిని ప్రయివేట్‌పరం చేయనని మోడి చెప్పి బొగ్గు బ్లాక్‌లను ప్రయివేటీకరణకు టెండర్లు ఎందుకు పిలిచారని, బిజెపి అంటేనే బడా జూటా పార్టీ, విభజన చట్టం హమీలను నెరవేర్చిన బిజెపి నేతలా మాకు నీతి మాటలు చెప్పేదా అని దుయ్యబట్టారు. మీడియాలో స్పేస్ కోసం బండి సంజయ్ ఆరాటపడుతున్నారన్నారు. ఆయన అధ్యక్ష పదవి ఉంటుందో ఉడుతుందో తెలియదని, ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. బిజెపి తెలంగాణలో ఏమైనా ఉంటే కదా గ్రాఫ్ పడిపోవడానికి, బండి సంజయ్ పగటి కలలు కంటున్నారన్నారు.
కెసిఆర్ ముచ్చటగా మూడవ సారి సిఎం కాబోతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలవడం ఖాయమన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని, కెసిఆర్ దిష్టిబొమ్మలు అక్కడక్కడ కాంగ్రెస్ నేతలు తగలబెట్టడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ కూడా ఏదో ఊహించనిన పగటి కలలు కంటోందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి సంక్షేమం ఉందానన్నారు. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని, రెండవ స్థానం కోసం కాంగ్రెస్, బిజెపి కొట్లాడుకుంటున్నాయన్నారు.