కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపణ
న్యూఢిల్లీ: దేశంలో ఏర్పడిన వైద్య సంక్షోభానికి బిజెపిదే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసే ఓటర్లు యావత్ భారతదేశం తరఫున తమ వాణి వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. బెంగాల్‌లో గురువారం ఆరవ విడత ఎన్నికలు జరగనున్నాయి.
ప్రభుత్వ జవాబుదారీతనానికి ఈ ఎన్నికలు నిదర్శనం కావాలని, దేశంపై విరుచుకుపడిన మహా వైద్య విపత్తుకు బిజెపినే బాధ్యత వహించాల్సి ఉంటుందని చిదంబరం ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఓటర్ల చేతుల్లోనే యావత్ దేశ ప్రజల ఆశలు ఉన్నాయని ఆయన తెలిపారు. యావత్ దేశం తరఫున మాట్లాడే గొప్ప అవకాశం రేపు బెంగాల్‌లో జరిగే ఆరవ విడత పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లకు లభించిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఏర్పడిన కరోనా సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ 2020 ఏప్రిల్ నుంచి పరిస్థితిలో ఏం మార్పు జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఏదైనా జరిగి ఉంటే అది పరిస్థితి మరింత దిగజారడమేనని ఆయన వ్యాఖ్యానించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద పోటెత్తిన వలస కార్మికులకు సంబంధించిన దృశ్యాలను టీవీ ఛానల్స్‌లో చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్లకు కొరత లేదని ఆరోగ్య శాఖ మంత్రి అంటున్నారు. ఆయన మాటనే నమ్ముదాం. దేశంలో కేవలం రోగుల కొరత మాత్రమే ఉంది. వ్యాక్సిన్లు ఎవరికి కావాలో దరఖాస్తు చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం మీడియాలో ప్రకటనలు గుప్పిస్తోందని భావించాల్సి ఉంటుంది. అదే విధంగా.. రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ లేదు అని రైల్వే శాఖ మంత్రి అంటున్నారు. ఆయన మాటనే నమ్ముదాం. టీవీ ఛానళ్లలో చూపిస్తున్న వలస కూలీలంతా రైల్వే స్టేషన్లను కాపలా కాసేందుకు రైల్వే పోలీసులకు సహకరిస్తున్నారను కోవాలి అంటూ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.