Monday, December 23, 2024

బిజెపికి జనసేన మద్దతు !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీని బిజెపి కోరింది. బుధవారం నగరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపి డాక్టర్ కె.లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పవన్‌ను కోరారు. అయితే ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ వారికి చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఎన్‌డిఎలో జనసేన కొనసాగుతున్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సుదీర్ఘంగా చర్చలు చేశారు. జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ బిజెపి నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, పార్టీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బిజెపి అభ్యర్థుల విజయానికి కృషి చేశామని,

ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కి ..పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజకీయ గందరగోళం జరగకూడదనే ఉద్దేశ్యంతో 2018లో కొత్త రాష్ట్రంలో పోటీ చేయకూడదన్న అభిప్రాయాన్ని గౌరవించామని, జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిజెపికి మద్దతిచ్చేందుకే పోటీ నుంచి తప్పుకున్నామని, అయితే ఈసారి తప్పక పోటీ చేయాలని తెలంగాణ జనసేన నేతలు పవన్‌ను కోరుతున్నారు. చాలా రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని నేతలు అభిప్రాయపడ్డారు. ఈసారి పదవీ విరమణ చేస్తే భవిష్యత్లో ప్రజల ముందుకు బలంగా వెళ్లడం కష్టమని, క్యాడర్‌కు నిరాశ తప్పదని స్పష్టం చేశారు. నేతల అభిప్రాయాలు విన్న పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తానే అర్థం చేసుకోగలనని, అయితే తనపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, ప్రజా సైనికులు, వీర వనితల అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సిందేనని పవన్ చెప్పినట్లు సమాచారం.

మూడు పార్టీల పొత్తుతో ఎన్నికలకు …
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు దాదాపు ఖాయమవ్వగా.. సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో మరో పొత్తు పొడుస్తోంది. జనసేనను కలుపుకునేందుకు తెలంగాణ బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. అయితే బిజెపి, జనసేనతో టిటిడిపి కూడా కలుస్తుందా? అనేది హట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో టిడిపి కూడా పొత్తుకు సిద్దంగా ఉంది. 87 సీట్లలో మాత్రమే పోటీ చేస్తామని.. ఆ సీట్లలో అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు టిడిపి స్పష్టం చేసింది. ఈ తరుణంలో బిజెపి, -జనసేన పొత్తులో టిడిపి కూడా కలుస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News