హైదరాబాద్ ః రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఒత్తిడి పెంచుతామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బషీర్‌బాగ్, చంద్రానగర్ బస్తీలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో స్ధానికులు డ్రైనేజీ, కమ్యూనిటీహాల్ మరమ్మతులు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, పెన్షన్లు ,
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఏ రకంగా నిధులు సమీకరణ చేస్తుందో వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏవిధంగా అమలు చేస్తారనే అవగాహన ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. హామీలను నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. కమ్యూనిటీహాల్ మరమ్మతుల పనుల కోసం అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ వెల్లడించారు.