Friday, December 20, 2024

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీతో ఉంది:మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, మాటల గారడీ మాదిరిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదన్నారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని, రైతుబంధు, రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటని ప్రశ్నించారు. వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్న హామీ నీటిమీద రాతలేనా అని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ ఇక అమలు కాలేదని రైతుల కోసం వరంగల్ లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని కాంగ్రెస్ బడ్జెట్ చెబుతోందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాల్లో మొదటి సమావేశంలో బిసి సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామనే వాగ్దానాన్ని తుంగలో తొక్కి బిసిలను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. కామారెడ్డిలో ప్రకటించిన బిసి డిక్లరేషన్ చెత్తబుట్టలో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామ పరిపాలన కోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచులను తొలగించి, ప్రత్యేక అధికారులను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల బలోపేతం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదని, అంటే ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించడం లేదనే విషయం బయటపడిందన్నారు. బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ. 11 వేల కోట్లు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రాజీవ్ ఆరోగ్య శ్రీని తెలంగాణలో అమలు చేస్తోందా దీనికోసం ఎన్ని నిధులు అవసరం ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు.

ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతానికి నిధులు కేటాయించకుండా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేసిన వాగ్దానాలు ఎలా అమలు చేస్తారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు మీరు కేటాయించిన నిధులు రూ. 28 వేల కోట్లు ఏమాత్రం సరిపోవని, గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి గొప్పగా చెప్పుకున్నారు. బడ్జెట్ లో కేటాయించింది మాత్రం రూ. 7,700 కోట్లు, వాగ్ధానం చేసినట్లుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే కేటాయించింది చాలా తక్కువన్నారు. బడ్జెట్ ప్రసంగంలో యూనివర్సిటీల ఊసేలేదని, ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందన్నారు. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసమని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News