Tuesday, January 21, 2025

బెదిరించి ఎంఎల్‌ఎలను చేర్చుకుంటున్నారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ షాద్ నగర్/మహబూబ్ నగర్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను సిఎం రేవంత్‌రెడ్డి బెదిరించి, బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను ఎలా నెరవేర్చాలో కాంగ్రెస్ సర్కార్‌కు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్, షాద్ నగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్‌కు దశ దిశ లేదని, నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులపై ఎలాంటి స్పష్టత లేదని, మహిళలకు రూ.2500 ఇచ్చే అంశం గాల్లో దీపంలా తయారైంది, ప్రతి విద్యార్థి రూ.5 లక్షల గ్యారంటీని గొప్ప చెప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్ బాటలనే నడుస్తున్నదని, గతంలో కెసిఆర్ కుటుంబం ప్రస్తుతం రాహుల్ గాంధీ కుటుంబం తెలంగాణను శాసిస్తుందన్నారు. రాహుల్ గాంధీ టాక్సీ పేరుతో కాంగ్రెస్ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని, హైదరాబాద్ లో రియర్టర్లు, బిల్డర్లను, వ్యాపారులను రాహుల్ గాంధీ ట్యాక్స్ కోసం వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కబ్జాలకు పాల్పడిన
బిఆర్‌ఎస్ నేతలపై చర్యలేవి
బిఆర్‌ఎస్ నేతలు కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారని గతంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారని, ఇప్పుడు మాత్రం వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలన్నీ ఉత్త మాటలే అని స్పష్టమైందని, ప్రభుత్వంలో ఏ ప్రాజెక్ట్‌పై కూడా విచారణ జరగడం లేదని, రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు బిఆర్‌ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కరువు ముంచుకొస్తుందని, అయినా సర్కారుకు పట్టడం లేదని, హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా తాగునీటి ఎద్దడి ఏర్పడి విద్యుత్ కోతలు ఉంటున్నాయని పేర్కొన్నారు. నేడు తెలంగాణ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని, దొంగలు పోయి గజ దొంగలు అధికారంలోకి వచ్చారని, కెసిఆర్‌ను దించాలనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. అంతే గానీ కాంగ్రెస్‌పై ప్రేమతో కాదని, ప్రతి ఎకరం మీద ఎరువులపై రూ.19 వేలు కేంద్రం సబ్సిడీ ఇస్తున్నదని ధాన్యం కొనుగోలు కోసం రూ. 26 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని, హమాలీల కూలీ నుంచి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు వరకు అన్ని మోదీ ప్రభుత్వమే భరిస్తున్నదని తెలిపారు.

వివిధ పార్టీలకు చెందిన
నాయకులు బిజెపిలో చేరికలు
మహబూబ్ నగర్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షాద్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు వారి అనుచరులతో కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని, ఇంటింటికీ మోడీ ప్రభుత్వ పథకాలు, 10 సంవత్సరాల పాలన గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News