Monday, December 23, 2024

కాళేశ్వరంపై అడిగినా సమాచారం ఇవ్వలేదు: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము అడిగినా కూడా సమాచారం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీను శనివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మేడిగడ్డ బ్యారేజీకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, రఘునందన్‌రావు, ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ రాగా వారికి చందుపట్ల రాంరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేల కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన ప్రాజెక్టు ఇప్పుడు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. ముఖ్యంగా నిర్మాణంలో నాణ్యతా ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం, ఇంజనీరింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో పగుళ్లు ఏర్పడ్డా యన్నారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉండి కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి లేఖ రాయడం జరిగిందని వారు

వెంటనే స్పందించి కేంద్ర జలవనరుల శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీని పంపడం జరిగిందన్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని 21 అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరగా వాళ్లు 11విషయాలపై సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనితోనే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంత విఫలం అయిందో తెలుస్తుందన్నారు. అన్నారం బ్యారేజీ కూడా ఇదే పరిస్థితిలో ఉందని, అలాగే బ్యారేజ్ వద్ద ఒక్క టిఎంసి నీరు కూడా నిల్వ ఉంచే పరిస్థితి లేదని కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అప్పులేని తెలంగాణలో అప్పు చేసి నిధులు తీసుకువచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేసి నిధులను నీళ్లపాలు చేశారని, కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైన ముఖ్యమైన ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతింటే మిగతా అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు వృథాగా నిర్మించినట్లే అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రం ముందుకు వచ్చి సిబిఐ దర్యాప్తు అంగీకరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో నియోజకవర్గ బిజెపి అభ్యర్థి చందుపట్ల సునీల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News