Monday, December 23, 2024

మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడ మొక్కటే శాశ్వత పరిష్కారం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: మణిపూర్‌లో మూడు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడమొక్కటే ఇక్కడ జాతుల మధ్య కొనసాగుతున్న ఘర్షణకు సరయిన పరిష్కారమని కుకీ నాయకుడు ఆ రాష్ట్రంలో బిజెపి ఎంఎల్‌ఎ అయిన పావోలీన్‌లాల్ హావోకిప్ అభిప్రాయపడ్డారు. మణిపూర్‌లో తాజాగా చెలరేగిన హింసాకాండ తర్వాత ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతుల వేర్పాటుతనానికి రాజకీయ, పాలనాపరమైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వూలో హావోకిప్ అభిప్రాయపడ్డారు. తోటి కుకీ నేతలు గతంలో లేవనెత్తిన కుకీలకు ప్రత్యేక పరిపాలనను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌నే ఆయన మరింత స్పష్టంగా ప్రస్తావించడం గమనార్హం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ మణిపూర్ సమగ్రత కాపాడాలని కోరుతున్న ఇంఫాల్‌కు చెందిన పలు సంఘాలతో కూడిన ‘ కోకోమి’ నేతృత్వంలోని మెయిటీ గ్రూపులు మాత్రం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఏ ప్రతిపాదనకైనా తాము వ్యతిరేకమని అంటున్నారు.

అంతేకాదు కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్‌లాంటి కుకీ గ్రూపులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నాగా, కుకీ, మెయిటీ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించడం చాలా కష్టమని, ఎందుకంటే చాలా గ్రామాలు, జిల్లాల్లో వీరంతా కలిసిపోయి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదన రాష్ట్రంలో శాశ్వత శాంతికి దోహదపడడమే కాకుండా, ప్రతి వర్గం కూడా రాణించడానికి దోహదపడుతుందని హావోపిక్ వాదిస్తున్నారు.ఈ ఏడాది మే ప్రారంభంలో మెయిటీలు, కుకీల మధ్య చెలరేగిన జాతుల ఘర్షణల్లో ఇప్పటివరకు 160 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులుగా మారిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో మెయిటీలు 53 శాతం మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంఫాల్ లోయ ప్రాంతలో ఉన్నారు. ఇక 40 శాతం దాకా ఉన్న నాగాలు, కుకీలు ప్రధానంగా కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.

రాష్ట్రప్రభుత్వం మెజారిటీలను దువ్వుతూ, మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కుకీ జో తిరుగుబాటు గ్రూపులతో చర్చలు జరపడం మంచి పరిణామమని ఈ ఏడాది ప్రారంభంలో మణిపూర్‌లోని చురుచంద్‌పూర్ జిల్లాలోని సాయికోట్ నియోజకవర్గంనుంచి గెలుపొందిన హావోపిక్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వనరుల కేటాయింపుల్లో అధికభాగం మెజారిటీలకే దక్కుతున్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని హావోపిక్‌తో పాటుగా ఇతర కుకీ నేతలు భావిస్తున్నారు. అలాగే మణిపూర్ అసెంబ్లీలో హిల్ ఏరియా కమిటీలాంటి యంత్రాంగాల ద్వారా తమను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోందని కూడా వారు భావిస్తున్నారు.అంతేకాదు రాష్ట్రంలో కుకీల జనాభా పెరిగినదృష్టా వారి జనాభా దామాషాప్రకారం వారికి మరిన్ని స్థానాలు కేటాయించాలంటూ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఇచ్చిన నివేదికను అడ్డుకోవడంపైనా వారు ఆగ్రహంతో ఉన్నారు.

అయితే కుకీ జోమి తెగ వారు నార్కో టెర్రరిస్టులని, నల్లమందు తయారీలో ఉపయోగించే గసగసాల పంటను సాగు చేస్తారని, మయన్మార్‌నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఇతర వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని జెఎన్‌టియు పూర్వ విద్యార్థి అయిన హావోపిక్ అంటున్నారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలోపాలు పంచుకున్న చరిత్ర కుకీలదని ఆయన అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News