హర్యానా, జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో బిజెపి అనూహ్యంగా ఆధక్యంలోకి దూసుకొచ్చింది. హర్యానాలో బిజెపి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. తొలుత చాలా వెనుకంజలో ఉన్న బిజెపి.. ఒక్కసారిగా ఆధిక్యంలోకి వచ్చింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. దీంతో హర్యానాలో కాంగ్రెస్ ఓటమి దిశగా కొనసాగుతోంది. ఇక, జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే, హర్యానాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. కాగా, హర్యానాలో 93 కౌంటింగం కేంద్రాలలో, జమ్ముకశ్మీర్ లో 28 కౌంటింగ్ కేంద్రాలలో కౌంటింగ్ జరుగుతోంది.
కాగా, ఇప్పటివరకు హర్యానాలో బిజెపి 47 స్థానాల్లో ముందజలో ఉండగా.. కాంగ్రెస్ 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జమ్ముకమ్మీర్ లో కాంగ్రెస్ కూటమి 48 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. బిజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇరు రాష్ట్రాల్లోనూ 90 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాలి.