బర్దోయి(ఉత్తర్ ప్రదేశ్): సమాజ్‌వాది పార్టీకి చెందిన ఒక నాయకుడి కుమార్తెతో పారిపోయిన బిజెపి నాయకుడు ఒకరిని ఆ పార్టీ బహిష్కరించింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆ నాయకడిని బిజెపి పార్టీ నుంచి బహిష్కరించింది. 47 ఏళ్ల బిజెపి నాయకుడు ఆశిష్ శుక్లా సమాజ్‌వాది పార్టీ నాయకుడి 26 ఏళ్ల కుమార్తెతో ఉడాయించినట్లు ఎప్‌ఐఆర్ నమోదైంది. ఇదివరకే వివాహమైన ఆశిష్ శుక్లాకు 21 ఏళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.
సమాజ్‌వాది పార్టీ నేత కుమార్తెకు పెళ్లి కుదరడంతో శుక్లాతో కలసి ఆమె వెళ్లిపోయినట్లు వర్గాలు తెలిపాయి. ఆశిష్ శుక్లా బిజెపి నగర విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్లు బిజెపి హర్దోయి జిల్లా మీడియా ఇన్‌చార్జ్ గంగేష్ పాక్ బుధవారం విలేకరులకు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శుక్లాను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. పార్టీతో అతనికి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదని, పోలీసులు అతనిపై ఎటువంటి చర్య అయినా తీసుకోవచ్చని పాఠక్ తెలిపారు.