సిఎం పదవికి పోటీ పడుతున్న నేతలతో చర్చించిన అధిష్ఠానం
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలన్నదానిపై బిజెపి అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. సిఎం పదవికి పోటీ పడుతున్నట్టుగా భావిస్తున్న సర్బానంద్‌సోనోవాల్, హిమాంతబిశ్వశర్మతో ఆ పార్టీ అధిష్ఠానం శనివారం మూడో రౌండ్ చర్చలు జరిపింది. వీరితో చర్చలు జరిపిన వారిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఉన్నారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన శర్మ అసోంలో ఆదివారం తమ పార్టీ నుంచి ఎన్నికైన ఎంఎల్‌ఎలతో సమావేశం నిర్వహించి శాసనాసభాపక్షం నేతను ఎన్నుకుంటామన్నారు.
అధిష్ఠానం నేతలు సిఎం పదవికి పోటీ పడుతున్న ఇరువురు నేతలను శుక్రవారమే ఢిల్లీకి పిలిపించుకొని మొదట వేర్వేరుగా రెండు దఫాల చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరువురితో తుదిదఫా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో శర్మ మాట్లాడారు. ఇప్పటివరకూ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సోనోవాల్ స్థానిక సోనోవాల్‌కచారీ గిరిజన వర్గానికి చెందినవారు. కాగా, సోనోవాల్ మంత్రివర్గంలో ఆరోగ్యమంత్రిగా పని చేసిన హిమాంతబిశ్వశర్మ స్థానిక బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 126స్థానాలున్న అసోంలో బిజెపికి 60, దాని మిత్ర పక్షాలైన ఎజిపికి 9, యుపిపిఎల్‌కు 6 సీట్లు వచ్చాయి. వైరి పక్షమైన మహాజోత్‌లోని కాంగ్రెస్‌కు 29, ఎఐయుడిఎఫ్‌కు 16, బిపిఎఫ్‌కు 4, సిపిఐ(ఎం)కు 1 సీట్లు వచ్చాయి.