- Advertisement -
హైదరాబాద్: బిజెపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2వ తేదీన నిర్వహించిన ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కెసిఆర్‌ను కించపరిచేలా ‘స్కిట్’ చేశారని టిఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడమేంటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు.
అయితే జిట్టాను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియదు. అర్ధరాత్రి ఎలాంటి నోటీసు లేకుండా పోలీసులు తమ పార్టీ నేతను అరెస్టు చేయడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోపిడీ దొంగలమాదిరిగా తమ పార్టీ నేతను కిడ్నాప్ చేశారని ఆయన మండిపడ్డారు. వెంటనే జిట్టా ఆచూకీ తెలపాలని, ఆయనను విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
- Advertisement -