Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ వైపు రెబల్స్ చూపు..

- Advertisement -
- Advertisement -

వరంగల్: కాంగ్రెస్, బిజెపిలోని అసంతృప్త నేతలు బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలపై బిఆర్‌ఎస్ ఫోకస్ చేసింది. దూకుడు పెంచి దూతలతో సంప్రదింపులు జరిపి తమ వైపునకు తిప్పుకుంటున్నది. అందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ జంగా రాఘవరెడ్డిపై ఫోకస్ చేసింది. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో నామినేషన్ల గడువు నాటికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అభ్యర్థిగా జంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే చివరి క్షణంలో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. దీంతో జంగాను పోటీ నుంచి తప్పించి బిఆర్‌ఎస్ లోకి రప్పించేందుకు నేరుగా మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. జంగాతో ఫోన్ ద్వారా జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. మంత్రి హరీశ్ రావు చొరవతో జంగా మెత్తబడ్డారు. కొన్ని అంశాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మంత్రి హామీతో బిఆర్‌ఎస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

ఈనెల 14వ తేదీ లేదా 16న మంత్రి హరీశ్ రావు సమక్షంలో జంగా బిఆర్‌ఎస్ చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఈలోగా తన అనుచరులతో ఒకసారి చర్చించేందుకు ఆయన రెఢీ అవుతున్నారు. జంగాను బిఆర్‌ఎస్ లో చేర్చుకోవడం ద్వారా మూడు నియోజకవర్గాల్లో పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ధర్మసాగర్ మండలం ఉనికిచర్లకు చెందిన జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ తో పొలిటికల్ జర్నీ ప్రారంభించారు. వరంగల్ డిసిసిబి చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్న జంగా కు 2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత జనగామ జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. అక్కడ ఇమడలేక వరంగల్ పశ్చిమలో తిష్ట వేశారు.

పశ్చిమ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. తనకే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. దీంతో మనస్తాపం చెందిన జంగా తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి పోటీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

మూడు నియోజకవర్గాల్లో కేడర్
డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉన్నది. పాలకుర్తి నుంచి పోటీ చేయడంతో అక్కడ కేడర్ ఉన్నది. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నాలుగు కార్పొరేటర్ లలో ఇద్దరు జంగా అనుచరులే. వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమలో కూడా జంగాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా బలమైన కేడర్ కూడా ఉన్నది. జంగా ను బిఆర్‌ఎస్ లో చేర్చుకోవడం వల్ల మూడు నియోజకవర్గాల్లో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమలో ఎక్కువగా కేడర్ ఉండడం లాభిస్తుందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జంగా చేరికతో ఆయన అనుచరులు బిఆర్‌ఎస్ కు ప్లస్ గా మారుతుంది.

బిఆర్‌ఎస్ కు లాభించనున్న రాకేష్ రెడ్డి చేరిక
ఇప్పటికే వరంగల్ పశ్చిమ నుంచి బిజెపి టికెట్ ఆశించి భంగపడ్డ ఏనుగుల రాకేశ్ రెడ్డి కూడా ఆ పార్టీని వీడి బిఆర్‌ఎస్ లో చేరారు. బిజెపికి రాజీనామా చేయగానే బిఆర్‌ఎస్ క్యాచ్ చేసింది. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ లో రాకేశ్ రెడ్డి చేరారు. పశ్చిమ తో పాటుగా కొంత భాగం వర్ధన్నపేట లో కూడా కేడర్ బలం కలిగి ఉన్న రాకేష్ రెడ్డి చేరికతో పార్టీకి అదనపు బలం చేకూరినట్లే. రెండు జాతీయ పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు నేతలు జంగా రాఘవరెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డిలతో కారు టాప్ గేర్ లో వెళ్లనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News