హైదరాబాద్ : నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు వల్లె వేశారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రూ. 5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తమ ఆరోగ్య శ్రీ పథకంగా మంత్రి ప్రచారం చేసుకోవడంపై సంగప్ప మండిపడ్డారు. తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో నారాయణఖేడ్‌లో చెక్ డ్యాంలు, నూతన చెరువులు, కాలువలు నిర్మించినట్లు హరీశ్ రావు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఇప్పటిదాకా.. ఒక్క కొత్త చెరువును గాని, కాలువను గాని తవ్వించినట్లయితే.. తాను ఎక్కడికంటే అక్కడ చర్చకు సిద్ధమని.. దమ్ముంటే రమ్మని హరీశ్ రావుకు సవాల్ విసిరారు. సిద్ధిపేటలో కట్టించిన చెక్ డ్యాంలు, చెరువులు, రంగనాయకసాగర్ నిర్మాణాలు రాష్ట్రమంతా ఉన్నట్లు హరీశ్ రావు భ్రమ పడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.
స్థానిక ఎమ్మెల్యే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నారాయణఖేడ్ మారిందన్నారు. గత ఉపఎన్నికల్లో గట్టులింగంపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తామని, హెలీకాప్టర్‌ను తిప్పి ఏరియల్ సర్వే చేయించినట్లు డ్రామా ఆడారని, ఇప్పటి దాకా తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని సంగప్ప దుయ్యబట్టారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఒకసారి… హరీశ్ రావు మరోసారి శంకుస్థాపనలు చేసి నారాయణఖేడ్ ప్రజల చెవిలో పూలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ తలాపునే ఉన్న మంజీరా నీళ్లను సిద్ధిపేట నియోజవర్గానికి తీసుకెళ్లి తమకేమో కాళేశ్వరం నీళ్లిస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఇప్పుడు నారాయణఖేడ్ ప్రజల్లో చైతన్యం వచ్చిందని, హరీశ్ రావు మోసపు మాటలను నమ్మే పరిస్థితి లేదని సంగప్ప అన్నారు.