Thursday, January 23, 2025

గుండెపోటుతో బీజేపీ నేత సొనాలీ ఫొగాట్ మృతి

- Advertisement -
- Advertisement -

పనాజీ/చండీగఢ్: మాజీ టిక్‌టాక్ స్టార్, హర్యానా బీజేపీ నేత సొనాలి ఫొగాట్ (42) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె అక్కడి అంజనా రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో ఒంటో నలతగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ఆమె మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని, ఫొగాట్ శరీరంపై ఎక్కడా గాయాల్లేవని గోవా డీజీపీ జస్పాల్ సింగ్ తెలిపారు. అయితే ఆమె మరణానికి స్పష్టమైన కారణాలేమిటనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వెల్లడవుతుందన్నారు. సొనాలీ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం బాంబోలిమ్ లోని గోవా ప్రభుత్వ వైద్య కళాశాల కు తరలించారు.
హర్యానా సిఎం సంతాపం
సొనాలీ ఫొగాట్ మరణం పట్ల హర్యానా సీఎం మనోహర్‌లాల్ కట్టర్, డిప్యూటీ సిఎం దుశ్యంత్ చౌతాలా, బీజేపీ నేతలు ఓపీ దస్కర్, కుల్దీప్ బిష్ణోయ్ తీవ్ర సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే సోనాలీ ఫొగాట్ తన మరణానికి కొద్ది సేపటి ముందే తన ట్విటర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. బీజేపీ నేత బిష్ణోయ్‌తో సమావేశమైన ఫోటోలను ఆమె షేర్ చేశారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఫోటోలను పంచుకున్నారు. 2006 లో టీవీ యాంకర్‌గా ప్రస్తానం ప్రారంభించిన సొనాలీ టిక్‌టాక్ వీడియోల ద్వారా బాగా పాప్యులర్ అయ్యారు. 2019లో బీజేపీలో చేరిన ఆమె అదే సంవత్సరంలో జరిగిన హర్యానా ఎన్నికల్లో ఆదంపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న సోనాలీ, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్‌లో ఎస్టీ విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2020 బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. 2016 డిసెంబర్‌లో ఆమె భర్త సంజయ్ ఫొగాట్ 42 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆమెకు కుమార్తె యశోధర ఫొగాట్ ఉన్నారు.

BJP Leader Sonali Phogat dies of Cardiac Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News