కాశ్మీర్‌ను పాక్‌కు అప్పగిస్తారంటూ కాంగ్రెస్‌పై ఆరోపణ
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణం రద్దు, రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఎంతో విషాదకరమని, తాము అధికారంలోకి రాగానే సమీక్షిస్తామంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వివరణ ఇవ్వాలని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర డిమాండ్ చేశారు. మోడీపైనా, దేశంపైనా ద్వేషాన్ని పెంచేందుకు పాకిస్థాన్‌తోపాటు చైనాతో కలిసేందుకూ కాంగ్రెస్ సిద్ధమని సంబిత్‌పాత్ర ఆరోపించారు.
దిగ్విజయ్‌పై కేంద్ర మంత్రులు గిరిరాజుసింగ్, కిరెన్ రిజీజ్ కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు పాకిస్థాన్ అంటే ఎంతో ప్రేమ అని, కాశ్మీర్‌ను ఆ దేశానికి అప్పగించేందుకు రాహుల్‌గాంధీ సానుకూలమన్న సందేశాన్ని దిగ్విజయ్ పంపిస్తున్నారంటూ గిరిరాజుసింగ్ విమర్శించారు. తన వ్యాఖ్యలపై బిజెపి నేతలు చేసిన విమర్శలకు కౌంటరిస్తూ దిగ్విజయ్‌సింగ్ మరో ట్విట్ చేశారు. నిరక్షరాస్యుల గుంపుకు తప్పనిసరిగా అలా చేస్తామనడానికీ, పరిశీలిస్తామనడానికీ(ఇంగ్లీష్‌లో) తేడా తెలియదంటూ బిజెపి నేతలనుద్దేశించి దిగ్విజయ్ ఎద్దేవా చేశారు.