స్వాతంత్య్రం కోసం వారు ఏమీ చేయలేదు
రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నారు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
బెంగళూరు : దేశ స్వాతంత్య్రం కోసం గాని, ఆర్థిక వ్యవస్థ, సమాజం అభ్యున్నతి కోసం గాని ఏమీ చేయని బిజెపి నాయకులు ‘నరకం వాసులు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం అభివర్ణించారు. కేంద్రాన్ని, ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్‌పై ఇటీవల రాజ్యసభలో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను తీవ్ర స్థాయిలో ఖర్గే తూర్పారపడుతూ, బిజెపి ప్రభుత్వం అన్ని రాజ్యాంగ విలువలను మంటగలుపుతోందని ఆరోపించారు. బెంగళూరులోని కర్నాటక పిసిసి కార్యాలయంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ప్రసంగిస్తూ, కాంగ్రెస్ భారత్‌ను స్వతంత్ర దేశంగా చేసిందని, దేశ సమైక్యత కోసం పాటుపడుతోందని చెప్పారు.
‘అయితే, బాధాకరమైన విషయం ఏమిటంటే ఇటీవల మన ముఖ్య నేతలు, ముఖ్యంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానించడం. భారత రాజ్యాంగ రూపశిల్పిపై అమిత్ షా హీనమైన వ్యాఖ్యలు చేశారు’ అని ఖర్గే తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలను ఖర్గే గుర్తు చేస్తూ, ‘నేను పార్లమెంట్‌లో ఉన్నాను. ‘మీరు అంబేద్కర్ పేరు పఠిస్తూనే ఉంటారు. మీరు భగవంతుని పేరు ఉచ్చరించినట్లయితే మీరు స్వర్గంలో చోటు దక్కించుకుని ఉండేవారు’ అని రాజ్యసభలో ఆయన (అమిత్ షా) అన్నారు’ అని తెలియజేశారు. ‘ఆ నరకం వాసులు మనకు స్వాతంత్య్రం తీసుకురాలేకపోయారు, ఆర్థిక, సామాజిక పరంగా దేశం కోసం ఏ మంచి పనినీ చేయలేదు’ అని ఖర్గే ఆరోపించారు.
75వ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యాన్ని ఖర్గే నొక్కిచెబుతూ, రాజ్యాంగం ప్రకారం వ్యవహరించడం భారతీయులకు ప్రధానం అని, కానీ కొన్ని కారణాలుగా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నదని అన్నారు. ‘పౌరులకు, ముఖ్యంగా మహిళలకు స్వాతంత్య్రం ఇచ్చిన హక్కులను కించపరుస్తున్నారు’ అని ఖర్గే విమర్శించారు. భారత్‌ను ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసేందుకు తాను కృషి చేస్తునానన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను కూడా ఖర్గే ఎద్దేవా చేశారు. ‘మోడీ ఉపన్యాసాన్ని వింటున్నాను. ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసేందుకు తాను పాటుపడుతున్నట్లు ఆయన చెప్పారు. కానీ అది ఐదవ స్థానం నుంచి కదలలేదు’ అని ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ దేశాన్ని నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థ చేసిందని, కానీ బిజెపి దాని ఐదవ స్థానానికి దిగజార్చిందని ఖర్గే వ్యాఖ్యానించారు.