డెహ్రాడూన్ ః ఉత్తరాఖండ్‌లో బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే యశ్‌పాల్ బెనామ్ కూతురు ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోనుంది. ఈ నెల 28న జరిగే పెళ్లి సంబంధిత పత్రికల పంపిణీ ఇప్పుడు దుమారానికి దారితీసింది. పౌరీ ప్రాంతానికి చెందిన ఈ నేత కూతురు ముస్లింను పెళ్లి చేసుకోవడంపై ప్రతిపక్షాలే కాకుండా బిజెపి నుంచి కూడా తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు దిగిందని హిందూత్వ అతివాదులు మండిపడ్డారు. వివాదాస్పద కేరళ స్టోరీలో జరిగినట్లుగానే ఇప్పుడు బిజెపి నేత ఇంట్లోనే లవ్ జిహాద్ చోటుచేసుకుందని కొందరు వ్యాఖ్యానించారు.
కేరళలో మతాంతరీకరణలు , లవ్‌జిహాద్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపే ది కేరళ స్టోరీ సినిమాకు బిజెపి పలు విధాలుగా వెన్నుదన్నులు అందించింది. బిజెపి పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపులు కల్పించాయి. మరి ఉత్తరాఖండ్‌లో ఈ పరిణామంపై బిజెపి సహకారంతో సినిమా తీయగలరా? అని ప్రతిపక్షాలు నిలదీశాయి. బిజెపి ద్వంద్వ ప్రమాణాలు , ఇతరులపై నిందలు , సొంత బాకాలకు ఉత్తరాఖండ్ పరిణామం నిదర్శనమని విమర్శలు వెలువడ్డాయి. ఈ బిజెపి నేత కూతురు లక్నో వర్సిటీలో చదువుకున్నప్పుడు ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడిందని, ఇది పెళ్లికి దారితీసిందని వెల్లడైంది. తన కూతురి పెళ్లికి రావాలని ఇప్పుడు పౌరీ మున్సిపాల్టీ ఛైర్మన్‌గా ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే బిజెపి, కాంగ్రెస్ నేతలకు ఆహ్వాన పత్రాలు పంపించారు.