జమ్ముకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా రాష్ట్ర బిజెపి నేతలు నిరసన చేపట్టారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద బిజెపి నిరసన కార్యక్రమం చేపట్టింది.ఈ
నిరసనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపిలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, తదితర నేతలు పాల్గొని పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి.. చేతిలో జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మృతులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. పాకిస్థాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 26మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.