Wednesday, January 22, 2025

గన్‌పార్కు వద్ద బిజెపి నిరసన దీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై గన్‌పార్కు అమర వీరుల స్థూపం వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. శుక్రవారం గన్‌పార్కు వద్ద దీక్ష చేపట్టడంతో పోలీసులు, బండి సంజయ్ మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అనంతరం పోలీసులు కాస్త వెనక్కి తగ్గడంతో సంజయ్ దీక్ష కొనసాగించారు. అనంతరం దీక్ష ముగించే సమయంలో టిఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని సంజయ్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి బయలుదేరిన బిజెపి నేతలను, బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

తర్వాత బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలించారు. అంతకుముందు బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి గన్‌పార్కు వరకు పాదయాత్ర చేపట్టారు. సంజయ్ తోపాటు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని ఆందోళనకు దిగారు. మంత్రి కెటిఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ వాస్తవం… గూడుపుఠాణి నిజం : బండి సంజయ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీకేజీ వాస్తవం… గూడుపుఠాణి జరిగిన మాట నిజం… దీనిపై స్పందించాల్సిన సిఎం నోరు మెదపడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గన్‌పార్క్ వద్ద ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీని నిరసిస్తూ బిజెపి అనేక రూపాల్లో ఉద్యమిస్తోందన్నారు.మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం హెచ్చరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు.

దీక్షలో పాల్గొన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, -నియామకాలతో ఏర్పడ్డ తెలంగాణ ఏమైంది? ప్రశ్నించారు. ‘పంచాయతీ కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. -టిఎస్పీఎస్సీ లీకేజీ అనుకోకుండా జరిగింది కాదు… ఇది వ్యూహాత్మకమే అన్నారు. తప్పు చేస్తే నా కొడుకు, బిడ్డను కూడా వదిలిపెట్టేది లేదని చెప్పిన కెసిఆర్ మీ మాటలేమయ్యాయ్ -అని వారు ప్రశ్నించారు. దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లుతో పాటు పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగిస్తే తమ పార్టీ వెనకంజ వేయదని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. బిజెపి నాయకులను అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. అదే విధంగా బిజెపి నేతలు సుభాష్, డి.కె.అరుణ, ఎంపి సోయం బాపూరావు, జితేందర్‌రెడ్డి గిరికపాటి మోహన్ రావు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News