Monday, January 20, 2025

రాష్ట్ర బిజెపిలో ముసలం

- Advertisement -
- Advertisement -
BJP Leaders secret meeting in Hyderabad
బండి సంజయ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి నేతల సమావేశం
పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్..అయోమయంలో రాష్ట్ర నాయకత్వం

హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. తాజాగా హైదరాబాద్ ఓల్డ్ ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో పలువురు అసమ్మతి నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకగా ఆ పార్టీ అసమ్మతి నేతలు ఈ సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన నేతలతో పాటు హైదరాబాద్ నుంచి కొందరు నేతలు పాల్గొన్నట్లుగా సమాచారం. ఈ రహస్య సమావేశంలో మాజీ ఎంఎల్‌ఎ గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్, వెంకటరమణి, రాములు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కరీంనగర్‌లో ఇలాంటి సమావేశమే నిర్వహించిన తరుణంలో హైకమాండ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి..బిజెపి జాతీయ నాయకత్వం ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత మల్లు ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో ఆయన అసంతృప్త నేతల్ని హైదరాబాద్ పిలిపించి మాట్లాడారు. దీంతో అంతా సర్దుకుంటుందని అంతా భావించారు.

అయితే అసంతృప్త నేతలు మాత్రం తగ్గేదెలే అన్నట్లుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాము పార్టీ కోసం కష్టపడ్డామని.. కానీ తమను అవమానాలకు గురిచేస్తున్నట్లుగా సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారు మంగళవారం మరోసారి సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాచారం. తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, గ్రేటర్ హైదరాబాద్‌లో మంచి ఫలితాలు సాధించిన బిజెపి.. టిఆర్‌ఎస్‌పై పోరును ముమ్మరం చేసింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇలాకాలోనే లుకలుకలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొత్తవారికి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వడం లేదని అసమ్మతి నేతలు వాపోతున్నట్లు సమాచారం. తమకు పార్టీలో గుర్తింపు దక్కడం లేదని ఆత్మగౌరవ నినాదంతో వీరు సమావేశాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మరి తాజా భేటీ తెలంగాణ బిజెపిలో తీవ్రస్థాయిలో కలకలం రేపుతోంది.

అంతేకాదు, మరోసారి పార్టీలో విభేదాలు భగ్గుమనడంపై పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా పరిగణించే అవకాశం లేకపోలేదు. కాగా పార్టీలో అసంతృప్తులు పెరిగి పోవడానికి గల కారణాలేమిటి? పార్టీలో చేరే కొత్తవారిని.. పార్టీలో పాతవారిని సమన్వయ పర్చడంలో బండి సంజయ్ విఫలమవుతున్నారా? ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా? ఇత్యాది అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఇదే విధంగా అసంతృప్త జ్వాలలు పెచ్చరిల్లితే పార్టీకి ఏ విధంగానూ లాభదాయకంగా ఉండబోదని పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది. మరి రానున్న కాలంలో తెలంగాణ బిజెపిలో నెలకొన్న అసంతృప్త జ్వాలలను పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు ఏ విధంగా కొలిక్కి తేనున్నారో.. వేచి చూడాల్సిందే.. !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News