Thursday, December 19, 2024

ఎండ్ల బండిపై అసెంబ్లీ సమావేశాలకు బిజెపి ఎంఎల్ఎలలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించకుండా, శాసనసభలో రైతు సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంభించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఎడ్లబండిపై శాసనసభ సమావేశానికి హాజరయ్యారు. శాసనసభ సమావేశాల సందర్భంగా వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్న ప్రతిపక్షాలు ఒక్కొక్కరు ఒక్కో తీరులో తమ నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల అరెస్టుకు నిరసనగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బేడీలతో ఇటీవలే సభకు హాజరయ్యారు. అలాగే ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించాలంటూ ఆ పార్టీ నేతలంతా ఆటో డ్రైవర్ల డ్రెస్సులు ధరించి అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. గురువారం రాష్ట్రంలో రైతుల సమస్యలను తీర్చాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఎడ్లబండిపై సభకు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎడ్ల బండ్లపై కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు, అమలు వైఫల్యంపై సభలో చర్చ చేపట్టాలని స్పీకర్‌కు బుధవారం బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

అయితే బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదా అంటూ మండిపడిన బిజెపి రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం నిరాకరించినందుకు నిరసనగా గురువారం ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయమే లేదా అని మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలకు మభ్యపెడుతోందని ఆరోపించారు. అర్హులైన రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. రైతు సమస్యలపై సర్కార్‌కు కనువిప్పు కలగాలనే తాము ఇవాళ ఎండ్లబండిపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News