Sunday, December 22, 2024

బెంగాల్‌లో బిజెపి బంద్‌కు పాక్షిక స్పందన

- Advertisement -
- Advertisement -

చెదురుమదురుగా దౌర్జన్య సంఘటనలు
భట్పారాలో కాల్పుల కలకలం
టిఎంసి గూండాలు కాల్పులు జరిపారన్న బిజెపి
ఇద్దరికి గాయాలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో 12 గంటల బంద్‌లో చెదురుమదురుగా దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. బంద్‌కు పాక్షిక స్పందన లభించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) బంద్ మద్దతుదారుల మధ్య సంఘర్షణ జరిగింది. ఆ ఘర్షణల్లో అత్యంత ప్రధానమైనది ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్పారాలో జరిగింది. తమ స్థానిక నాయకుడు ప్రియంగు పాండే కారుపై టిఎంసి గూండాలు అనేక రౌండ్లు కాల్పులు జరిపారని బిజెపి ఆరోపించి, ఆ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక వీడియోను సామాజిక మాధ్యమ వేదికల్లో పంచుకున్నది, పాండే గాయపడకుండా తప్పించుకున్నప్పటికీ వాహనం డ్రైవర్‌కు, ఒక పార్టీ కార్యకర్తకు తలపై తూటా గాయాలు తగిలినట్లు, వారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు బిజెపి నాయకులు తెలియజేశారు.

అయితే, ఆంగ్లో ఇండియా జ్యూట్ మిల్లు వెలుపల కొందరు వ్యక్తులు ఆ ఇద్దరిని కొట్టారని పోలీసులు చెప్పారు. స్థానిక బిజెపి నాయకుడు అర్జున్ సింగ్, టిఎంసి నాయకుడు సోమ్‌నాథ్ శ్యామ్ మధ్య వాగ్వాదం అనంతరం దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారిద్దరు, వారి మద్దతుదారులు ఎదురెదురుగా నిల్చునని వాదనకు దిగడంతో ఉద్రిక్తలు పెరిగాయి. ఆ వర్గాలను చెదరగొట్టడం పోలీసులకు కష్టమైంది. ‘టిఎంసికి చెందిన దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు దగ్గరలో లేకుంటే జనం శక్తి ఏమిటో టిఎంసికి చూపి ఉండేవారం’ అని అర్జున్ సింగ్ అన్నారు. ‘ప్రశాంత ప్రదేశంలో హింసాకాండ ప్రజ్వలన’కు బిజెపి నాయకుడు ప్రయత్నించారని శ్యామ్ ఆరోపించారు.

బుధవారం ఉదయం నుంచి బంద్ అమలు కోసం జనాన్ని కోరుతూ, రోడ్లపై అవరోధాలు ఏర్పాటు చేసినందుకు మాజీ ఎంపిలు రూపా గంగూలి, లాకెట్ ఛటర్జీ, రాజ్యసభ ఎంపి సమిక్ భట్టాచార్య, ఎంఎల్‌ఎ అగ్నిమిత్ర పాల్ సహా పలువురు బిజెపి నాయకులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై కొత్తగా ఏర్పాటైన విద్యార్థుల బృందం ఛాత్ర సమాజ్ నిర్వహించిన ‘నబన్న అభిజాన్’ లేదా సచివాలయానికి పాదయాత్రలో పాల్గొన్నవారిపై మంగళవారం పోలీస్ చర్యకు నిరసన సూచకంగా పిలుపు ఇచ్చిన ‘బంగ్లా బంద్’ ఉదయం 6 గంటలకు మొదలైంది. బంద్ రాష్ట్రంలో దైనందిన జీవితాన్ని పాక్షికంగా ప్రభావితం చేసింది.

బయట అల్లర్లు జరగవచ్చుననే భయంతో చాలా మంది ఇళ్లలోనే ఉండిపోయారు. కోల్‌కతాలో రోజూ మామూలుగా ఉండే సందడి కనిపించలేదు. తక్కువ సంఖ్యలో బస్సులు, ఆటోలు, టాక్సీలు తిరిగాయి. ప్రైవేట్ వాహనాలు చాలా తక్కువగా తిరిగాయి. అయితే, మార్కెట్లు, దుకాణాలు తెరిచే ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు తెరిచారు. కానీ విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉన్నది. కోల్‌కతాలో పెక్కు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు తరగతులను సస్పెండ్ చేశాయి. అనేక ప్రైవేట్ కార్యాలయాల్లో హాజరు శాతం అల్పంగా ఉన్నది. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయవలసిందని అడిగారు. అయితే, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు మామూలుగానే ఉన్నది. బంద్ అమలుకు ఒత్తిడి తెచ్చే యత్నం చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు బిజెపి నాయకులను నిర్బంధంలోకి తీసుకున్నారు,

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News