ఏప్రిల్ నెలాఖరు లోగానే భారతీయజనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకొనే అవకాశం ఉంది. 13 రాష్ట్రాలలో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత 13 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను పార్టీ ప్రకటిస్తుందని బీజేపీ వర్గాలవారు తెలిపారు.
పార్లమెంటు ప్రస్తుత సమావేశాలు ఈ నెల 4వ తేదీతో ముగుసిన వెంటనే అధికార బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రాష్ట్రాలలో బీజేపీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం మొదలైంది. మార్చి 15 నాటికే ఈ ఎన్నికల ప్రక్రియపూర్తవుతుందని భావించినా, పార్లమెంటు సమావేశాల కారణంగా మరి కాస్త ఆలస్యం అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక దాదాపు పది నెలలుగా పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.
13 రాష్ట్రాలలో బిజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త అధ్యక్షులను ప్రకటిస్తారు. వచ్చే వారం లోనే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల బిజేపీ అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తారు. మొత్తం 19 రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల పేర్లు
ప్రకటించిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. 2019నుంచి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపి నడ్డా ఉన్నారు. 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికై, అమిత్ షా నుంచి బాధ్యతలు చేపట్టారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని 2024 జూన్ వరకూ పొడిగించారు. నడ్డా కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత , కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యం అయింది. కొత్త అధ్యక్ష అభ్యర్థి కి ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులు తప్పని సరిగా ఉండాల్సి ఉంటుంది.