Friday, November 22, 2024

బిజెపి శాశ్వతంగా అధికారంలో ఉంటాననుకుంటోంది: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘భారత్‌లో బిజెపి శాశ్వతంగా అధికారంలో ఉంటాననుకుంటోంది. కానీ ప్రతిపక్షాలు ఏకమై దాని పన్నాగాన్ని తుత్తునియలు చేస్తాయి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాన్నికి చేయగలిగిందంతా చేస్తాయి’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. తన వారం రోజుల యుకె పర్యటన ముగింపుకు ముందు సోమవారం సాయంత్రం లండన్‌లోని ఛాతం హౌస్‌లో మేధావులతో జరిగిన సంభాషణ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. కేరళలోని వాయనాడ్ ఎంపీ అయిన తన ఫోన్‌లో కూడా ఇజ్రాయెల్ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను పెట్టారని ఆయన అన్నారు.

‘బిజెపి పదేళ్లు అధికారంలో ఉండకముందు, మేము పదేళ్లు అధికారంలో ఉన్నాము. భారత్‌లో తాము అధికారంలోకి వచ్చామని, శాశ్వతంగా అధికారంలో ఉంటామని బిజెపి భావిస్తోంది. కానీ అలా కుదరదు’ అని 52 ఏళ్ల రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌తో పాటు విదేశీ మీడియా కూడా ‘భారత ప్రజాస్వామ్యంలో తీవ్రమైన సమస్య ఉందని భావిస్తున్నాయి’ అని ఛాతం హౌస్‌లో రాహుల్ గాంధీ ఎత్తిచూపారు.

ఇదిలావుండగా రాహుల్ గాంధీ విదేశంలో భారత్‌ను కించపరుస్తున్నారని బిజెపి నిందించింది. కాంగ్రెస్ నాయకుడు దేశద్రోహానికి పాల్పడుతున్నారని కేంద్ర సమాచార , ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ విమర్శించారు.

ఛాతం హౌస్‌లో రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)ను కూడా తూర్పారబట్టారు. ‘అదో ఫండమెంటలిస్ట్, ఫాసిస్ట్ సంస్థ’ అన్నారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలను హస్తగతం చేసుకుని ఆర్‌ఎస్‌ఎస్ ప్రజాస్వామ్య ఎన్నిక విధానాన్నే మార్చేసిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి వివరించమని ప్రేక్షకుల నుంచి ఒకరు కోరగా ‘దానిని ఓ రహస్య సమాజం(సీక్రెట్ సొసైటీ)గా భావించొచ్చు. అది ముస్లింల సోదరభావం పద్ధతిలో రూపొందింది. దాని ఉద్దేశ్యం అధికారంలోకి రావడమే. ఆ తర్వాత ప్రజాస్వామ్య పోటీతత్వాన్నే మార్చేయడం. దేశంలో ఒక్కో రాజ్యాంగ సంస్థను వారు హస్తగతం చేసుకుంటూ పోతున్న తీరును చూస్తుంటే నాకే దిగ్భ్రాంతి కలుగుతోంది. పత్రికారంగం, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం వంటి అన్ని రాజ్యాంగ సంస్థలు నేడు వారి ఒత్తిడికి లోబడి పనిచేస్తున్నాయి. వారు నయానాభయాన తాము కోరుకున్నది చేయించగలుగుతున్నారు’ అని వివరించారు. పాకిస్థాన్, భారత్ సంబంధాలపై వ్యాఖ్యానిస్తూ ఇరుగుపొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ‘ఒకవేళ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని భారత్‌లో ప్రోత్సాహిస్తే, రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డం కష్టం.  ఇరుగుపొరుగు సంబంధాలు చెడిపోతాయి’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News