మనతెలంగాణ/ హైదరాబాద్ : దొంగతనం చేసిన బిజెపి నాయకులు వాళ్లే దొంగ దొంగ అని అరిచి.. ప్రజాస్వామ్యాన్ని బిజెపి అపహస్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. గురువారం సంస్థాన్ నారాయణపురంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు మాతో టచ్ లో ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్లే నిన్న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎరవేసేందుకు బేర సారాలు జరిగాయన్నారు.
ప్రజా తీర్పును బిజెపి నాయకులు నోట్ల కట్టలతో తుంగలో తోస్తున్నారు. కుట్రలు కుతంత్రాలు బిజెపికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రజాస్వామ్యంపై విషం చిమ్ముతున్న బిజెపి.. విష సంస్కృతికి నిలువుటద్దం. నిన్న టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని బిజెపి ముఠా ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోవడంతో బిజెపి నాయకులు డ్రామా అని బుకాయిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా 8 రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను బిజెపి కూల్చడం కూడా డ్రామానా..? అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో భూదాన్ యజ్ఞ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.