బెంగళూరు: ఉమ్మడి పౌరస్మృతి అమలు, 10 లక్షల ఉద్యోగాల కల్పన, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ హోదా వంటి వాగ్దానాలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేసింది. గత మ్యానిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాలకు వాగ్దానాలు చేసి అమలు చేశామని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం తెలిపారు.
అమూల్‌లో నందినీ మిల్క్‌ను విలీనం చేయాలన్న రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రతిపాదనకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడంతో వెనక్కు తగ్గిన బిజెపి పేద కుటుంబాలకు రోజూ అరలీటరు నందిని పాలు ఉచితంగా అందచేస్తామని వాగ్దానం చేసింది.
అలాగే పేద కుటుంబాలకు ఏడాదికి 3 ఎల్‌ఫిజి సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని బిజెపి హమీ ఇచ్చింది.
పట్టణ ప్రాంతాలలో పేదల కోసం 5 లక్షల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలలో 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని బిజెపి వగ్దానం చేసింది. రేషన్ షాపులలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు కిలో ఉచిత బియ్యంతోపాటు ఐదు కిలలో సిరిధాన్యాలను కూడా పంపిణీ చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో అధికార బిజెపి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. బిజెపి అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోడీ సైతం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందరికీ సమన్యాయం, బుజ్జగింపులకు దూరం అనే నినాదంతో బిజెపి ప్రచారాన్ని సాగిస్తోంది. రాష్ట్రంలో ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం, పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్న వొక్కలిగలు, లింగాయత్‌లకు ఆ రిజర్వేషన్ల శాతాన్ని కల్పించాలని భావిస్తోంది.