న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సంకల్ప్ పత్ర పేరిట ఈ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. మేనిఫెస్టోకు మోడీ కి గ్యారంటీ అనే శీర్షిక పెట్టారు. బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన పమేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా, ఈ ఎన్నికల పత్రం రూపకల్పన కమిటీ ఛైర్మన్ రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర నేతలు హాజరయ్యారు.
ఈసారి బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఏముంటుందో అనే తీవ్ర ఉత్కంఠత నెలకొంటూ వచ్చింది. ఈ దశలో 14 వాగ్ధానాలతో ఈ ఎన్నికల పత్రం వెలువరించారు. ఇందులో ప్రత్యేకించి మహిళా సాధికారికత, యువజన అభ్యున్నతి, పేదల సంక్షేమం వంటి కీలక అంశాలు ఉన్నాయి. తమది జ్ఞాన్ గరీబు, యువ, అన్నదాత, నారీ ప్రగతి లక్షాలను సంతరించుకున్న మేనిఫెస్టో అని బిజెపి వర్గాలు ఈ నేపథ్యంలో తెలిపాయి. ప్రత్యేకించి భారతదేశ సౌభాగ్యం, అంతర్జాతీయ సంబంధాల మెరుగుదల, దేశ వారసత్వ సంపద ఇనుమడింపచేయడం వంటివి కూడా పొందుపర్చారు.
ప్రత్యేకించి ఈసారి మేనిఫెస్టోలో ప్రతిపాదించిన అంశాలు ఇవే
1 దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం ఒకే ఎన్నికలు), ఉమ్మడి ఎలక్టోరల్ జాబితా
2 పేదలకు ఉచిత రేషన్, మంచినీరు, గ్యాసు కనెక్షన్లు
3 ఉమ్మడి పౌరస్మృతి పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురావడం
4 పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం (బిజిలి) యోజన పరిధిలో పేదలకు జీరో ఎలక్ట్రిసిటి బిల్లు
5 దేశంలో 3 లక్షల మంది లక్‌పతి దీదీలు
6 సర్వేకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్త్రీలలో తలెత్తే ఎముకల అవలక్షణాల సమస్య నివారణలపై ప్రత్యేక దృష్టి
7 మహిళా శక్తి వందన చట్టం పూర్తి స్థాయి అమలు, మహిళలకు మరిన్ని వాష్‌రూంలు
8 వందేభారత్ రైలు వ్యవస్థ విస్తరణ, రైళ్లలో ప్రయాణాల వెయిటింగ్ లిస్ట్ పద్ధతి ఎత్తివేత
9 అమృత్ భారత్, నయో భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం
10 కొత్త విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మెట్రో వాటర్ మెట్రోల ఏర్పాట్లు
11 గిగ్ వర్కర్లు, వలసకార్మికులు, టాక్సీ డ్రైవర్లు, ఇంటిపని వారిని ఇ శ్రమ్ పోర్టల్‌లో చేర్చడం
12 హైవేలలో ట్రక్కు డ్రైవర్లకు అధునాతన సౌకర్యాలు
13 ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఉత్సవ్ నిర్వహణ
14 అయోధ్యలో పర్యాటకం, అనుబంధ సౌకర్యాలు విస్తరించడం, ఇది కాకుండా భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వ లక్ష సాధనకు మరింత పాటుపడటం
ఉచిత రేషన్ మరో ఐదేండ్లు
మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ తమ పార్టీ ప్రజల జీవన హుందాతనం, జీవన ప్రమాణం, భారీ పెట్టుబడుల క్రమంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల దిశలో మేనిఫెస్టోను రూపొందించిందని తెలిపారు. ప్రజల మర్యాదకర జీవితానికి మోడీ గ్యారంటీ ఉంటుంది. జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అందించిన ఉచిత రేషన్ వచ్చే ఐదేళ్లు సాగుతుందన్నారు. ఇక ప్రజలకు ఇప్పుడు జన్ ఔషధీ కేంద్రాల నుంచి 80 శాతం తగ్గింపు ధరలకు అందుతోన్న ఔషధాలు ఇకపై కూడా అందుతాయి.
కాగా ఈ కేంద్రాలను ప్రభుత్వం విస్తరిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పరిధిలో రూ.5 లక్షల వరకూ ఇప్పుడు అందుతున్న చికిత్స కొనసాగుతుంది. 70 ఏండ్లు పై బడ్డ వారిని, ట్రాన్స్‌జెండర్స్‌ను కేడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి చేర్చడం జరుగుతుందని ప్రధాని తెలిపారు. 75 ఏండ్లు దాటిన వారిని ఉచిత చికిత్సల సేవల పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ముద్ర యోజన పరిధిలో ఇప్పుడున్న రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ 20 లక్షలకు పెంచుతారు. ఇక వందేభారత్ రైళ్లలో మూడు రకాలు ఉంటాయని, వీటిని వందేభారత్ స్లీపర్లు, వందేభారత్ ఛెయిర్, వందేభారత్ మెట్రోలుగా సాగుతాయని వివరించారు.
తిరిగి తమ ప్రభుత్వం వస్తే బుల్లెట్ ట్రైన్‌ను ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాల ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు సర్వే జరుగుతుందని తెలిపారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు, అన్ని ఇండ్లకు పైప్‌లైన్ గ్యాస్ సమకూర్చడం జరుగుతుందన్నారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ మేనిఫెస్టోలోని విషయాలను తూచా తప్పకుండా అమలు చేసి తీరడం అనేది బిజెపికే చెల్లుతుందని, ఈ విషయం 2019 ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని అంశాల అమలుతో ప్రజలకు ఇప్పటటికే విదితం అయిందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోకు మోడీ గ్యారంటీ అనే పేరు పెట్టింది ఇందుకే అన్నారు.
మోడీ గ్యారంటీ తిరుగులేనిది: 24 క్యారెట్ బంగారమే
మోడీ గ్యారంటీలకు తిరుగులేదని బిజెపి సీనియర్ నేత ఒకరు మేనిఫెస్టో నేపథ్యంలో తెలిపారు. గ్యారంటీ ఫక్కా 24 కారట్ గోల్డ్ అని, ఇప్పటికే బంగారపు పాలన ప్రమాణాలను చాటుకుందని ప్రకటించారు.