న్యూఢిల్లీ : సిబిఐ, ఇడి, ఐటి తదితర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలు, ఆయా పార్టీల నేతలను లక్షంగా చేసుకుని వేధిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీపై తాజాగా మరో సంచలనాత్మక విషయం వెల్లడైంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వారిపై బిజెపి దుష్ప్రచారానికి పాల్పడుతోందని బట్టబయలైంది. ఒక రకంగా ప్రాపగాండ ఫ్యాక్టరీ నడుపుతోందని తేటతెల్లమైంది. అందుకోసం కిరాయి ఉద్యోగులను నియమించుకుని కోట్లాది రూపాయలను కుమ్మరిస్తోందని ‘ఆల్ట్ న్యూస్’ పరిశోధనాత్మక కథనాన్ని వెల్లడించింది. ఒకే ఐపి అడ్రస్‌తో 23 వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ లింక్‌ల ద్వారా ప్రతిపక్ష నాయకులను లక్షంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతోందని పూసగుచ్చినట్లు వివరించింది. నకిలీ వెబ్‌సైట్లకు కోట్లాది రూపాయాల ప్రకటనలు ఇచ్చి పెంచి పోషిస్తోందని తెలిపింది. 2019 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు సాగించిన పరిశోధన క్రమాన్ని ఆల్ట్ న్యూస్ వెల్లడించింది.
ఆయా వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ లింక్‌లకు సంబంధించిన వివరాలు, వాటికి ఇప్పటి వరకు బిజెపి ఇచ్చిన ప్రకటనలు, చెల్లించిన మొత్తాలను కూడా అంకెలతో సహా బట్టబయలు చేసింది. ఇందుకోసం ఫేస్‌బుక్ తన నిబంధనలు కూడా తుంగలో తొక్కి పరోక్షంగా బిజెపికి సహకరించిందని తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్, మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జెఎఎం అధినేత సోరెన్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ తదితర నాయకుల ప్రతిష్టను మసకబార్చేందుకు దిగుజారుడు చర్యలకు పూనుకున్నారని కూడా తెలిపింది. ఆయా పార్టీలు, నేతల పేర్లను అవమానకర రీతిలో, జనం ఏవగించుకునే పద్దతిలో మార్చుతూ నవ్వుల పాలు చేస్తున్న తీరును ఎండగట్టింది.
వెబ్‌సైట్ రూపకర్తలు దాన్ని రిజిస్టర్ చేసే సమయంలో ఇచ్చిన అడ్రస్‌లను ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే వాటిలో కొన్ని ఫోన్ నెంబర్‌లు కూడా పూర్తిగా లేవని, మరికొన్ని బిజెపి కేంద్ర కార్యాలయాన్ని సూచిస్తున్నాయని స్పష్టం చేసింది. ‘మెటా’ యాడ్ లైబ్రరీని తరచి పరిశీలిస్తే ‘ఫాల్తూ ఆద్మీ పార్టీ’ పేరిట సృష్టించిన ఒక ఫేస్‌బుక్ పేజీలో కేజ్రీవాల్‌కు, ఆప్ పార్టీకి వ్యతిరేకంగా దారుణమైన సామాజిక దాడి జరిగిందని తేలింది. ఇందుకోసం రూ.42లక్షలు వెచ్చించారని, 2553 ప్రకటనలు వెల్లువెత్తాయని బయటపడింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయావతి సహా విపక్షాలపై జరిగిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదని ఆల్ట్‌న్యూస్ వివరించింది. అధికారానికి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా ఫేస్‌బుక్ ఐడీలు, వెబ్‌సైట్‌ల పేర్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారని తేలింది.
ఆ వెబ్‌సైట్లు ఇవే…
1. jharkhand2019(.)com
2. chormachayeshor(.)com
3. ghargharraghubar(.)com
4. thefrustratedbengali(.)com
5. phirekbaarmodisarkar(.)com
6. modisangnitish(.)com
7. nirmamata(.)com
8. up2022(.)com
9. bhakbudbak(.)com
10. mahathugbandhan(.)com
11. telanganaatmagouravam (.)com
12. kamaldobara(.)com
13. olirattumputhuvai(.)com
14. valarchipaadaiyiltamizhagam(.)com
15. buababua(.)com
16. teisheabarbjpsarkaar(.)com
17. modisaatherajasthan(.)com
18. theindiancompass(.)com
19. meghalayawithmodi(.)com
20. mp2023(.)com
21. pappugappu(.)com
22. shivshahiparat(.)com
23. chuntliexpress(.)com