Monday, January 20, 2025

పగదాడులు

- Advertisement -
- Advertisement -

Indian Independence Day Diamond Celebrations

బిజెపి తన నీడను చూసి తానే భయపడుతున్నదా, ఆ నీడలో నిరంతరం దానికి ప్రజల్లో బాగా పలుకుబడి గల ప్రతిపక్ష పార్టీలు, వాటి నేతలే కనిపిస్తున్నారా? కెసిఆర్, మమత బెనర్జీ, కేజ్రీవాల్ వంటి ఉద్దండులైన నేతలు బిజెపికి పీడకలలు రప్పిస్తున్నారా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కేంద్రంలో తిరుగులేని అధికారంలో గల బిజెపి తన అదుపాజ్ఞల్లో ఉన్న సిబిఐ, ఇడి, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలను తన బలమైన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికే ప్రయోగిస్తున్నది. కీలకమైన ప్రతి ఎన్నిక లేదా ముఖ్యమైన ప్రతి రాజకీయ ఘట్టం సమీపించినప్పుడెల్లా వారిపై ఈ దాడులకు తెగిస్తున్నది. గతంలో కర్ణాటకలో ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి కె శివకుమార్ ఇళ్లపై సిబిఐ జరిపిన దాడులు, సోదాలు తెలిసినవే, ఇటీవల మహారాష్ట్రలో శివసేన కన్వీనర్ సంజయ్ రౌత్ ఇళ్లపైనా ఇదే కక్ష సాధింపు దాడులకు ఇ డి పాల్పడింది. ఎంత అవినీతికి పాల్పడినవారైనా బిజెపిలో చేరిపోతే ఈ దాడులు, సోదాలకు దూరంగా సురక్షితంగా దర్జాగా బతకవచ్చనే అభిప్రాయం స్థిరపడిపోయింది. దేశంలో అవినీతిని, ముఖ్యంగా దొడ్డిదారుల్లో విశేషంగా డబ్బు చేసుకొనే దొడ్డ పదవుల్లోనివారి అవినీతిని ఆరా తీసి తగిన ఆధారాలతో చట్టానికి అప్పగించడానికి నెలకొన్న కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ చేతిలోని కీలుబొమ్మలుగా మార్చివేసి బిజెపి దేశానికి ఎంత అన్యాయం చేస్తున్నదో చెప్పతరం కాదు. ఈక్రమంలో ఇప్పుడు దేశ రాజధానిలో పుట్టి తనకు బలమైన జాతీయ ప్రత్యామ్నాయంగా, ప్రత్యర్థిగా ఎదుగుతూ పాలనలో వినూత్న విప్లవాత్మక మార్పులు తెస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) మీద బిజెపి తన పెంపుడు జాగిలా ల్లాంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నది. శుక్రవారం నాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇళ్లపైన,దేశంలోని మరి 30 చోట్ల సిబిఐ జరిపిన దాడులు ఎవరికీ దిగ్భ్రాంతి కలిగించి ఉండవు, ఎందుకంటే అవి బిజెపికి అనుదిన కార్యక్రమంగా మారిపోయాయి, రాజకీయ రంగు పులుముకొన్నాయనే సంగతి వారికి తెలుసు. దగ్గర పడుతున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఆప్‌ను దెబ్బ తీయడం కోసం ఈ అప్రతిష్ఠాత్మక దాడులు జరిగాయన్న ఆరోపణ వినిపిస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకొన్న పూర్వపు మద్యం విధానంలో భారీ ఎత్తు అవకతవకలు జరిగాయనే కారణం చూపి ఈ దాడులు జరిపారు. ఇటువంటి దాడులు, సోదాలు చేసినప్పుడు అవినీతికి సంబంధించి ఏమేమి పత్రాలు దొరికాయి, అక్రమంగా ఆర్జించిందని భావిస్తున్న సొమ్ము ఎంత దొరికింది అనే సమాచారాన్ని బహిరంగ పరచవలసి ఉంటుంది. అది జరగడం లేదు. అందుచేత ఈ దాడులు, సోదాలపై ఎవరికి తోచినట్టు వారు, ఎవరు కోరుకొన్నట్టు వారు అనుకోవలసి వస్తున్నది. శుక్రవారం నాటి దాడులకు సంబంధించి సిబిఐ ప్రాథమిక అభియోగ పత్రాన్ని సిసోడియా శనివారం నాడు మీడియాకు చూపించారు. అందులో కేవలం రూ.కోటి కిమ్మత్తు కుంభకోణం ఉన్నట్టు పేర్కొనగా బిజెపి నాయకులు రూ. 8000 కోట్లు, రూ.11,000 కోట్ల అవినీతి జరిగినట్టు ప్రచారం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టి సిబిఐ కేసు నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. కాని ఈ దాడులు, సోదాల వల్ల ఆప్ పైన, దాని నాయకులపైన చెప్పుకోదగినంత బురద పడిపోయింది. గుడ్డ కాల్చి మీద వెయ్యడమంటే ఇదే. ఇంతకు ముందు ఆప్ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు తనను కూడా అరెస్టు చేస్తారని సిసోడియా అంటున్నారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోడం లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను వినియోగించడం వల్ల, నిజంగా జరిగిన కుంభకోణాల్లో అవి చేపట్టే శోధనకు సైతం విలువ లేకుండాపోతుంది. దేశ రాజకీయాలను నెమ్మది నెమ్మదిగా అల్లుకుంటున్న ఆప్ మంచి పాలనకు, జనహిత మార్గాల్లో అధికారాన్ని వినియోగించడానికి మంచి ఉదాహరణగా తనను తాను రుజువు చేసుకొంటున్నది. అందుకే ఢిల్లీ తర్వాత మొన్న జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అది ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆప్ ఇంతింతై ఎదిగి తన మార్కు పాలనను ప్రచారం చేసుకొని దేశ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని ఆర్భాటంలేని అడుగులు వేస్తున్నది. విద్య, వైద్య రంగాలలో అది తీసుకొచ్చిన మార్పులకు అంతర్జాతీయంగా మంచి ఖ్యాతి లభిస్తున్నది. ఆప్ విద్యా విధానాన్ని మెచ్చుకొంటూ దాని సారథి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఫోటో సహా ప్రత్యేక కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొదటి పేజీలో ఇటీవల ప్రచురించింది. అది జరిగిన వెంటనే సిసోడియా ఇళ్లల్లో సిబిఐ సోదాలు జరగడం యాదృచ్ఛికం అని అనుకోలేము. తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిఎంకె ప్రముఖులను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నమూ జరిగింది. అందుచేత కేజ్రీవాల్ మరింతగా బలపడి ప్రధాని మోడీకే సవాలు కాకుండా చేసుకోడానికి ఈ దాడులు జరిపిస్తున్నారని ఆప్ చేస్తున్న విమర్శను కొట్టిపారేయలేము.

BJP Misusing ED and CBI against Opposition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News